తిరుమల
శ్రీ వేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణానికి ముందు రోజు
చేపట్టే అంకురార్పణ ఆదివారం సాయంత్రం రంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీవారి సేనాధిపతి
విష్వక్సేనుడి పర్యవేక్షణలో అంకురార్పణ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది.
శ్రీవారి
తరఫున విష్వక్సేనులవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపుగా వెళ్ళి బ్రహ్మోత్సవాలు
పర్యవేక్షించారు.
స్వామివారి
ఆలయానికి నైరుతి దిశలో భూదేవిని పూజించి, పుట్ట మన్నును సేకరించి ఊరేగింపుగా
ఆలయానికి చేరుకున్నారు. ఈ మట్టిలో నవ ధాన్యాలను ఆరోహింపజేసే కార్యక్రమాన్ని
అంకురార్పణంగా పిలుస్తారు. నేటి నుంచి సెప్టెంబర్ 26 వరకు జరిగే శ్రీవారి సాలకట్ల
బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
వైఖానస
ఆగమంలో అంకురార్పణ ఘట్టానికి విశేష ప్రాధాన్యముంది. విత్తనాలు మొలకెత్తడాన్ని
అంకురార్పణ అంటారు. ఉత్సవాలు విజయవంతం కావాలని సంకల్పించడంతో పాటు స్వామి వారి ఆశీస్సులు
పొందడమే ఈ ఘట్టం ఉద్దేశం.
నేటి
సాయంత్రం 6.15 నుంచి 6.30 గంటల మధ్య మీన లగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం నిర్వహించడంతో
ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. రాత్రి 9 గంటలకు పెద్ద శేషవాహనంపై శ్రీదేవి, భూదేవి
సమేత మలయప్పస్వామి ఊరేగనున్నారు.
స్వామివారికి ప్రభుత్వం తరఫున నేడు ముఖ్యమంత్రి జగన్ పట్టువస్త్రాలు
సమర్పించనున్నారు.
రాత్రి
7.45 గంటలకు బేడి ఆంజనేయ స్వామి ఆలయం నుంచి శ్రీవారికి పట్టు వస్త్రాలు తీసుకెళ్ళి
సమర్పిస్తారు. పెద్ద శేష వాహన సేవలో పాల్గొని శ్రీ పద్మావతి అతిథి గృహంలో రాత్రి
బస చేస్తారు. మంగళవారం ఉదయం 6.20 గంటలకు స్వామివారిని దర్శించుకుంటారు.