తెలంగాణలో
చరిత్ర సృష్టించేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని, వచ్చే ఎన్నికల్లో తమ పార్టీకి
ఓట్లు వేసి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ కోరింది. హైదరాబాద్ లో నిర్వహించిన సీడబ్ల్యూసీ
సమావేశాల ముగింపు సందర్భంగా కాంగ్రెస్
పార్టీ తెలంగాణ ప్రజలను ఈ మేరకు కోరింది.
తెలంగాణ
ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీ కీలకపాత్ర పోషించిందని గుర్తు చేసిన కాంగ్రెస్, యూపీఏ
చైర్పర్సన్ సోనియా గాంధీ, అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రజల ఆకాంక్షలను
గుర్తించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని సీడబ్ల్యూసీ తీర్మానంలో ఆ
పార్టీ ప్రస్తావించింది.
తెలంగాణ
ఏర్పడి తొమ్మిదేళ్ళు గడుస్తున్నా బంగారు తెలంగాణగా అభివృద్ధి చేయడంలో కేంద్ర,
రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల్ని మోసం చేశాయని ఆరోపించింది. రెండు రోజులు పాటు
హైదరాబాద్ వేదికగా జరిగిన సీడబ్ల్యూసీ సమావేశాలు ముగిశాయి.
సొంతపార్టీ
నేతలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయవద్దని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ
సందర్భంగా నేతలకు సూచించారు. పార్టీ ప్రయోజనాలు దెబ్బతీసేలా ఎవరూ వ్యవహరించొద్దని
హెచ్చరించారు. సీడబ్ల్యూసీ సమావేశాల్లో ఆయన నేతలకు దిశానిర్దేశం చేశారు. నేతలంతా
క్రమశిక్షణ పాటించి పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు.
పార్టీ నేతలకు ఆ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ కీలక సూచనలు చేశారు. కాంగ్రెస్
పార్టీ ప్రయోజనాలకు హాని కలిగించే వ్యాఖ్యల జోలికి నేతలెవరూ పోవద్దని సూచించారు.
పొరపాటుగా ఏ చిన్న విమర్శ చేసినా అది పార్టీకి పెద్దస్థాయిలో నష్టం చేసే అవకాశం
ఉందన్నారు. మీడియా ముందుకు వచ్చినప్పుడు సంయమనం పాటించాలని నేతలకు దిశానిర్దేశం
చేశారు.
తెలంగాణలోని
పలు నియోజకవర్గాల్లో సోమవారం కాంగ్రెస్ ముఖ్యనేతలు పర్యటించనున్నారు. కామారెడ్డిలో
పంజాబ్ మాజీ సీఎం చెరంజీత్ చన్నీ, ఆదిలాబాద్ లో తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జి మాణిక్ రావ్ ఠాక్రే, కరీంనగర్ లో
ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు, కుత్బుల్లాపూర్ లో సీడబ్ల్యూసీ శాశ్వత
ఆహ్వానితుడు సుబ్బిరామిరెడ్డి, జూబ్లిహిల్స్ లో లోక్సభ మాజీ స్పీకర్ మీరాకుమార్,
జడ్చర్లలో రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలెట్, రాజేంద్రనగర్ లో మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చౌహాన్, ఎల్బీనగర్ లో ఛత్తీస్ఘడ్
సీఎం భూపేశ్ భగేల్ పాల్గొననున్నారు.