అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతోన్న భారత సంతతి వ్యక్తి వివేక్ రామస్వామి సంచలన హామీ ఇచ్చారు. తాను అధికారంలోకి వస్తే 75 శాతం ప్రభుత్వ ఉద్యోగులను తొలగిస్తానని, ఎఫ్‌బీఐని మూసివేస్తానని ఇప్పటికే ప్రకటించారు. ఇక తాజాగా హెచ్ 1బి వీసాల జారీలో లాటరీ విధానాలకు స్వస్తి పలికి, ప్రతిభకు పట్టంకడతానని రామస్వామి ప్రకటించారు. రామస్వామి గెలిస్తే అమెరికా వీసా విధానాల్లో సమూల మార్పులు జరిగే అవకాశం ఉంది.
లాటరీ విధానంలో ఇస్తోన్న హెచ్-1బి వీసా ప్రక్రియను ప్రతిభ ఆధారిత వ్యవస్థలోకి మార్చాల్సి ఉందని రామస్వామి అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం వీసా అభ్యర్థించే కంపెనీలే లాభపడుతున్నాయన్నారు. ఇది ఒక రకంగా ఒప్పంద సేవ లాంటిదేనని వివేక్ రామస్వామి అభిప్రాయపడ్డారు. నైపుణ్యం ఆధారంగా మాత్రమే వీసాలు మంజూరు చేయాలని, వలసదారుల కుటుంబీకులు ప్రతిభ ఆధారంగా అమెరికాకు రావడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు.
2021లో అమెరికాలో 85 వేల మంది నైపుణ్యం కలిగిన సిబ్బందికి డిమాండ్ ఉండగా, 8 లక్షల దరఖాస్తులు అందాయి. ఏటా దాదాపు 65 వేల వీసాలు అందుబాటులో ఉంటుండగా, వీరిలో 25 వేలు అమెరికాలో ఉన్నత చదువులు చదువుతున్నవారు పొందుతున్నారు. మొత్తం అమెరికా జారీ చేస్తోన్న హెచ్-1బి వీసాల్లో మూడో వంతు భారతీయ నిపుణులే దక్కించుకుంటున్నారు.