కేరళ రాష్ట్రంలో నిఫా కంగారుపెడుతోంటే, ఒడిశాను స్క్రబ్టైఫస్ వణికిస్తోంది. ఒడిశాలోని సుందర్గడ్ జిల్లాలో 11 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో స్క్రబ్టైఫస్ పాజిటివ్ సంఖ్య 180కి చేరిందని అధికారులు వెల్లడించారు. వ్యాధి లక్షణాలతో ఉన్న వారిలో 59 మందిని పరీక్షించగా 11 మందికి పాజిటివ్ తేలింది. 9 మంది ఇతర జిల్లాల నుంచి సుందర్గడ్కు వలస వచ్చిన వారని గుర్తించారు.
నాలుగైదు రోజులు జ్వరం తగ్గకపోతే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని వైద్యాధికారులు కోరుతున్నారు. స్క్రబ్టైఫస్ వ్యాధి వేగంగా ప్రభలడంతో తగినంత మంది సిబ్బందికి శిక్షణ ఇచ్చిరంగంలోకి దించినట్టు రూర్కెలా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ తెలిపారు. ఇప్పటికే ఈ వ్యాధి భారిన పడి ఏడుగురు చనిపోయినట్టు అధికారులు ప్రకటించారు.
బర్గడ్ జిల్లాలో 11 పాజిటివ్ యాక్టివ్ కేసులున్నాయి. స్క్రబ్టైఫస్ అటవీ ప్రాంతాలు, పొలాల్లో పనులు చేసుకునే వారికి ఎక్కువగా ఈ వ్యాధి వస్తోందని గుర్తించారు. ముందుగా శరీరంపై మచ్చ ఏర్పడుతుంది. ఒక రకమైన పురుగులు కుట్టడంతో మచ్చలు ఏర్పడుతున్నాయని డాక్టర్లు గుర్తించారు. కీటకాలు కుట్టిన ప్రాంతంలో చర్మకణాలు చనిపోయి మొద్దుబారి పోతోందని తెలిపారు. వెంటనే చికిత్స తీసుకోకపోతే ప్రాణాపాయం ఉంటుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.