టీడీపీ
అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ ఉందనేది అసత్య ప్రచారమని
ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి అన్నారు. చంద్రబాబు అరెస్టును తెలుగు
రాష్ట్రాల బీజేపీ నేతలు ఖండించారని ఆమె గుర్తు చేశారు. సీఐడీ ఏపీ ప్రభుత్వం
ఆధ్వర్యంలో పనిచేస్తోందన్న పురందరేశ్వరి, చంద్రబాబు అరెస్టు విధానాన్ని తొలుత
తప్పుపట్టింది బీజేపీనే అన్నారు.
టీడీపీ-జనసేన
పొత్తు గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడటంపై స్పందించిన పురందరేశ్వరి, జనసేన పార్టీ,
బీజేపీతోనే పొత్తులో ఉందన్నారు. టీడీపీతో పొత్తుపై పవన్ చేసిన వ్యాఖ్యలను తప్పుగా
చూడటం లేదన్నారు. కేంద్ర పెద్దలతో
చర్చించిన తర్వాత తమ అభిప్రాయం చెబుతామన్నారు. రాష్ట్రం లోని రాజకీయ పరిస్థితులను జాతీయ నేతలకు
తెలియజేస్తామన్నారు. పొత్తులపై జాతీయ స్థాయిలో నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు.
ప్రధాని
నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా విజయవాడ వన్ టౌన్ కోమల విలాస్ సెంటర్ లో
ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు వేడుకలు నిర్వహించిన ఏపీ బీజేపీ, మహిళలకు చీరలు
పంపిణీ చేశారు. బీజేపీ ఎప్పుడు సేవకు పెద్దపీట వేస్తుందని పేర్కొన్న
పురందరేశ్వరి, ప్రధాని మోదీ కూడా తాను దేశ
సేవకుడు అని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు.
ఓటు బ్యాంకు రాజకీయాలకు బదులుగా
బీజేపీ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని చెప్పారు. మహిళలు, పేదల అభ్యున్నతి కోసం
కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు.