విదేశాల్లో ఉన్నత విద్యకు టోఫెల్ తప్పనిసరి. ఇంగ్లిష్ భాషా నైపుణ్యాన్ని ఈ పరీక్ష ద్వారా అంచనా వేస్తారు. టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాజ్ ఏ ఫారెన్ లాంగ్వెజ్ పరీక్ష రాసేవారి సంఖ్య దేశంలో గణనీయంగా పెరుగుతోంది. కరోనా తరవాత ఈ వేగం మరింత పెరిగింది. కోవిడ్ ఆంక్షలు తొలగిపోవడంతో టోఫెల్ రాసే వారి సంఖ్య ఒకేసారి 59 శాతం పెరిగినట్టు ఈటీఎస్ సంస్థ వెల్లడించింది.
ప్రపంచ వ్యాప్తంగా 2022లో టోఫెల్ రాసిన వారిలో 12.3 శాతం భారతీయులే కావడం గమనార్హం. టోఫెల్‌ను నిర్వహించే ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్ పరీక్ష రాసిన వారి సంఖ్య 59 శాతం పెరిగిందని వెల్లడించింది. అమెరికా, బ్రిటన్ దేశాలకు మాత్రమే కాకుండా ఏ దేశంలో ఉన్నత విద్యానభ్యసించాలన్నా టోఫెల్ ఉపయోగపడుతుంది. సింగపూర్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, స్వీడన్ దేశాలకు వెళ్లే విద్యార్థుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. టోఫెల్ పరీక్షల్లో పాసైన విద్యార్థులను కెనడా కూడా అనుమతిస్తోంది. ప్రపంచంలో 160 దేశాల్లోని 12000 యూనివర్శిటీలు టోఫెల్‌ను గుర్తించాయి. ముఖ్యంగా అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, యూకే దేశాలకు చెందిన 98 శాతం యూనివర్శిటీలు టోఫెల్ ఆధారంగా విద్యార్దులను అనుమతిస్తున్నాయి.
టోఫెల్ స్కోరు ఆధారంగా విదేశాల్లో డిగ్రీ, పీజీ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తున్నారు. న్యూయార్క్ యూనివర్శిటీ, కొలంబియా, మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వంటి ప్రతిష్ఠాత్మక యూనివర్శిటీలు కూడా టోఫెల్ ఆధారంగా అడ్మిషన్లు చేపడుతున్నాయి.