టీడీపీ
జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అధ్యక్షతన దిల్లీలో టీడీపీ పార్లమెంటరీ
పార్టీ సమావేశం జరిగింది. ఈ నెల 18 నుంచి 22 వరకు జరిగే పార్లమెంట్ ప్రత్యేక
సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు లోకేశ్ దిశానిర్దేశం చేశారు.
రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు ఉభయసభల దృష్టికి తీసుకెళ్ళాలని సూచించారు.
అంతకు
ముందు దిల్లీలో మీడియాతో మాట్లాడిన లోకేశ్, వైసీపీని వ్యతిరేకించే పార్టీలు
టీడీపీ-జనసేనతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. తమతో కలిసి వచ్చే ప్రతి పార్టీకి
స్వాగతం పలుకుతామన్నారు. వచ్చే ఎన్నికల్లో తమదే విజయమని ధీమా వ్యక్తం చేసిన లోకేశ్…
జగన్ అవినీతి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు.
చంద్రబాబు
అరెస్టును టీడీపీ ప్రచారంలో ఓ స్పీడ్ బ్రేకర్ గానే చూస్తామన్న లోకేశ్, స్కిల్ కేసు విషయంలో దేశ ప్రజలకు వాస్తవాలు
చెప్పేందుకే దిల్లీ వచ్చినట్లు చెప్పారు. అవినీతి
నిరోధక చట్ట నిబంధనలు ఉల్లంఘించి చంద్రబాబును అరెస్టు చేశారన్నారు. 17(ఏ) నిబంధన
ప్రకారం అరెస్టుకు ముందుస్తు అనుమతి తప్పనిసరి దానిని సిట్ పట్టించుకోలేదన్నారు.
చంద్రబాబు ఎలాంటి అవినీతికి పాల్పడలేదని లోకేశ్ ఉద్ఘాటించారు.