జమ్మూకశ్మీర్‌లో
భారత రక్షణబలగాలు, ఉగ్రవాదుల మధ్య భీకరపోరు కొనసాగుతోంది. ఇవాళ జరిగిన ఎదురుకాల్పుల్లో
ముగ్గురు ముష్కరులు హతమయ్యారు. బారాముల్లా జిల్లాలోని ఉరీ పరిధిలోని నియంత్రణ రేఖ
వద్ద భారత భూభాగంలోకి అక్రమంగా చొరబడేందుకు యత్నించిన ఉగ్రవాదులను
నియంత్రించేందుకు రక్షణ బలగాలు యత్నించాయి. అయితే ఉగ్రవాదులు సైన్యంపై కాల్పులకు
తెగబడ్డారు. దీంతో ఆర్మీ కూడా ఎదురు కాల్పులు జరపడంతో ముగ్గురు ముష్కరులు
చనిపోయారు.
ఉరీ
సమీపంలోని హత్లాంగ ప్రాంతం నుంచి భారత్ లో చొరబడేందుకు ముగ్గురు ఉగ్రవాదులు
ప్రయత్నించారు. వెంటనే అప్రమత్తమైన ఆర్మీ వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది.
దీంతో ఉగ్రవాదులు భారత సైనికులపై కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఎదురు కాల్పులు
అనివార్యమయ్యాయి.
ఇద్దరు
ఉగ్రవాదుల మృతదేహాలను ఆర్మీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మూడో ఉగ్రవాది
శవాన్నీ స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తుండగా సరిహద్దుల అవతలి వైపు నుంచి పాక్
సైన్యం కాల్పులు జరిపిందని ఆర్మీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉరీ సెక్టార్ లో
ఆపరేషన్ కొనసాగుతోందని చినార్ కార్ప్స్ తెలిపింది.
మరోవైపు
అనంత్‌నాగ్ జిల్లాలో నాలుగో రోజు ఉగ్రవాదుల వేట కొనసాగుతోంది. గఢాల్ అడవుల్లో ఎత్తైన
కొండల్లో దాగి ఉన్న ఉగ్రవాదులను కనిపెట్టేందుకు డ్రోన్లను ప్రయోగిస్తోంది. డ్రోన్
సర్వే ఆధారంగా తీవ్రవాదులు నక్కిన ప్రాంతంపై మోర్టార్ షెల్స్ తో దాడి చేస్తోంది.
ఇద్దరు లేదా ముగ్గురు ఉగ్రవాదులు అడవిలో దాక్కోని ఉండవచ్చు అని భద్రతా బలగాలు
అంచనా వేస్తున్నాయి.
జమ్మూకశ్మీర్
లోని అనంత్‌నాగ్ జిల్లా కొకెర్నాగ్ ప్రాంతంలోని పీర్ పంజాల్ పర్వత శ్రేణుల్లో
ఉగ్రవాదులు ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నారు. గతంలో పాక్ సైనిక మూకల ఆక్రమణకు నిలయంగా
మారిన ఈ పర్వతాల్లో లష్కరే, జైషే మూకలు దాక్కున్నాయి.
బుధవారం జరిగిన ఎన్కౌంటర్లో
ఒక కల్నల్, మేజర్, కశ్మీరీ పోలీస్ డీఎస్పీ, రాష్ట్రీయ రైఫిల్స్ కు చెందిన సైనికుడు
వీరమరణం పొందారు.
పీర్‌పంజాల్ పర్వత శ్రేణులు ఉన్న పూంచ్, రాజౌరీల్లో
ఇటీవల కాలంలో ఉగ్రదాడులు బాగా పెరిగాయి. పాక్ నుంచి సరిహద్దు దాటుకుని ఇక్కడకు
వచ్చిన తీవ్రవాదులు శ్రీనగర్, దోడా వెళ్ళాలంటే అనంతనాగ్ మీదుగా ప్రయాణించాల్సి
ఉంటుంది.