కాంగ్రెస్
నాయకత్వంలోని ప్రతిపక్ష ఇండీ కూటమి 14మంది న్యూస్ యాంకర్ల కార్యక్రమాలను
బహిష్కరిస్తున్నట్టు చేసిన ప్రకటన, బహిష్కరణలా కాక వారిపై నిషేధం విధించినట్టే
ఉంది. మీడియా స్వేచ్ఛను అడ్డుకోడానికి చేస్తున్న ప్రయత్నంలాగే ఉంది. ఇండీ
కూటమిలోని 38 పార్టీల ప్రతినిధులు, ఆయా న్యూస్ ఛానెళ్ళలో సదరు యాంకర్లు నిర్వహించే
కార్యక్రమాలకు హాజరు కాబోమని ప్రకటించారు.
ఏదైనా చర్చా
కార్యక్రమంలో అతిథులుగా వెళ్ళే రాజకీయ నాయకులు, న్యూస్ ఛానెళ్ళవారు అడిగే
ప్రశ్నలకు జవాబులు ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. అలాంటి చర్చాకార్యక్రమాలను, తమపై
విమర్శలను తిప్పికొట్టడానికి వేదికలుగా మలచుకుంటారు. రాజకీయాల్లో తమ స్థానాన్ని
సుస్థిరం చేసుకోడానికి మీడియా ఒక మార్గమనే అభిప్రాయంతో విభేదించే నాయకులు ఎవరూ
ఉండరు. అలాంటిది, కొంతమంది యాంకర్లు నిర్వహించే చర్చా కార్యక్రమాలను
బహిష్కరిస్తున్నామంటూ ప్రకటించడం, అది కూడా ప్రతిపక్షంలో ఉన్న కూటమి ప్రకటించడం,
విచిత్రం మాత్రమే కాదు, అలాంటి చర్యల ద్వారా వారు మీడియా స్వేచ్ఛనే నిషేధిస్తున్నారనుకోవాల్సిందే.
కాంగ్రెస్
నాయకత్వంలోని ఇండీ కూటమి తీసుకున్న ఈ నిర్ణయం, మరోసారి ఎమర్జెన్సీ పరిస్థితులను
గుర్తు చేస్తోంది. అప్పట్లో ఇందిరాగాంధీ ప్రభుత్వం పాత్రికేయుల నోళ్ళు మూయించింది,
తిరగబడే ప్రయత్నం చేసినవారిని జైళ్ళలో పెట్టించింది. ఇప్పుడు ప్రతిపక్ష కూటమి
తీసుకున్న నిర్ణయం దాదాపు అలాంటిదేనని మీడియా విమర్శిస్తోంది. ‘మీడియా ఎమర్జెన్సీ’ని
సహించేది లేదని న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అండ్ డిజిటల్ అసోసియేషన్ ప్రకటించింది.
‘ఆ యాంకర్లు
ఆతిథ్యం వహించే కార్యక్రమాలు విద్వేషాన్ని వెదజల్లుతున్నాయి. వాటికి మేం చట్టబద్ధత
ఇవ్వదలచుకోలేదు’ అని కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా వ్యాఖ్యానించారు. ఇండీ కూటమి
విధించిన ఈ బహిష్కరణ శిక్ష, చాలామంది పాత్రికేయులకు ఆశ్చర్యం కలిగించింది. రిపబ్లిక్
టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్ణబ్ గోస్వామి… భారత్ 24 యాంకర్ రుబికా లియాకత్…
ఇండియాటుడే-ఆజ్‌తక్ నెట్‌వర్క్‌కు చెందిన సుధీర్ చౌదరి, చిత్రా త్రిపాఠీ, గౌరవ్
సావంత్, శివ్ అరూర్… టైమ్స్ నెట్వర్క్ గ్రూప్ ఎడిటర్ నావికా కుమార్… టైమ్స్ నౌ
యాంకర్ సుశాంత్ సిన్హా… సీఎన్ఎన్ న్యూస్ 18కు చెందిన అమన్ చోప్రా, అమిష్ దేవ్గన్,
ఆనంద్ నరసింహన్…. ఇండియా టీవీకి చెందిన ప్రాచీ పరాశర్… భారత్ ఎక్స్‌ప్రెస్‌కు
చెందిన అదితి త్యాగి…. డీడీ న్యూస్ యాంకర్ అశోక్ శ్రీవాస్తవ్… ఈ నిషిద్ధ జాబితాలో ఉన్నారు.
ఈ జాబితాలో తన పేరు
చూసి ఆశ్చర్యపోయానంటున్నారు సుశాంత్ సిన్హా. ‘‘ఇదేదో బహిష్కరించడానికి రూపొందించిన
జాబితాలా లేదు, లక్ష్యం చేసుకున్న జాబితాలా ఉంది. ఈ జాబితాలో నాలాంటి కొంతమంది
ఎలాంటి చర్చలూ చేపట్టరు, అసలు అతిథులు ఎవరినీ తమ కార్యక్రమాలకు ఆహ్వానించరు. అసలు
నా షోకి అతిథులే రానప్పుడు, వారిని నా షోకి రాకుండా ఎవరు ఆపుతున్నారు?’’
అన్నారాయన.
నిజానికి ఈ చర్య
వల్ల ఇండీ కూటమికే నష్టం ఎక్కువ. ఎమర్జెన్సీ సమయంలో పాత్రికేయులను
అణగదొక్కేసినట్టే ఇప్పుడు కూడా ఈ ఎంపిక చేసిన మీడియా యాంకర్లను
అణగదొక్కేస్తున్నారన్న భావన సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతోంది. ఈ
జాబితాలోని యాంకర్లను ఇండీ కూటమిలోని పార్టీలకు చెందిన కొందరు నాయకులు ఫోన్లు చేసి
మరీ బెదిరిస్తున్నారు. తగిన పరిణామాలకు ఎదురుచూడాల్సిందంటూ హెచ్చరిస్తున్నారు. ఈ దేశపు జర్నలిస్టులు ఇలాంటి బెదిరింపులకు లొంగుతారా?
అని అడుగుతున్నారు సుశాంత్ సిన్హా.
మరో యాంకర్ రుబికా
లియాకత్, తన ఎక్స్ హ్యాండిల్లో స్పందించారు. ‘‘ఇది జర్నలిస్టులను బహిష్కరించడం
కాదు, వారిని భయపెట్టడమే. ఇది మీడియాను బహిష్కరించడం కాదు, మీడియా అడిగే ప్రశ్నలకు
జవాబు చెప్పలేక పారిపోవడమే. ఎంతసేపూ మీకు ఊకొట్టే వాళ్ళతోనే మీకు అలవాటైపోయింది.
కానీ నేను అలా చేయలేదు, చేయను, చేయబోను. నన్ను నిషేధించే ధైర్యమే మీకుంటే, ప్రేమ
దుకాణంలో ద్వేషాన్ని వడ్డిస్తున్నవారిని నిషేధించండి’’ అని ట్వీట్ చేసారు.
మరోవైపు…. ఇండీ కూటమి
తీసుకున్న నిర్ణయానికి ఆ కూటమిలోని పార్టీల నాయకులే కట్టుబడి ఉండడం లేదు. ఈ ఫత్వా
జారీచేసిన కొన్ని గంటల్లోనే చిత్రా త్రిపాఠీ కార్యక్రమంలో సమాజ్‌వాదీ పార్టీకి
చెందిన అనురాగ్ భదోరియా పాల్గొన్నారు. అంటే ఈ విషయంపై వాళ్ళలో వాళ్ళకే ఏకాభిప్రాయం
లేదని అర్ధమవుతోంది, అలాగే ఈ జాబితాలో పేర్కొన్న సుశాంత్ సిన్హా, సుధీర్ చౌధురి
వంటివారు అసలు డిబేట్ షోసే నడపరు. అందుకే ఇది యాంకర్లను నిషేధించడానికి మాత్రమే
కాదు, వారిని లక్ష్యంగా చేసుకోడానికే అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇండీ
కూటమి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ యాంకర్లపై నకిలీ కేసులు మోపి,
వారిని భయపెడతారేమోనన్న అనుమానాలు తలెత్తుతున్నాయి.