టీడీపీ
అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై సీఎం జగన్ మోహన్ రెడ్డి ఘాటు
విమర్శలు చేశారు. స్కిల్ స్కామ్ లో అరెస్టై జైల్లో ఉన్న చంద్రబాబుతో పవన్ ములాఖాత్
అవ్వడాన్ని సీఎం ఎద్దేవా చేశారు. ములాఖత్‌లో భాగంగా ఇరువురూ రాజకీయంగా మిలాఖత్
అయ్యారని దుయ్యబట్టారు.
చంద్రబాబు అరెస్టు
తర్వాత మొదటిసారి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ వ్యవహారంపై స్పందించారు.
స్కిల్
స్కామ్ సూత్రధారి, పాత్రధారి చంద్రబాబేనని ఆరోపించిన సీఎం జగన్, నకిలీ ఒప్పందంతో
ప్రభుత్వ ఖజానాను దోచేశారన్నారు. ప్రజాధనం దోచుకున్న చంద్రబాబును కాకుంటే ఇంకెవరిని
అరెస్టు చేయాలని సీఎం జగన్ ప్రశ్నించారు.
తూర్పుగోదావరి
జిల్లా నిడదవోలులో పర్యటించిన సీఎం జగన్, వైఎస్సార్ కాపు నేస్తం లబ్ధిదారులకు
నాలుగో విడత ఆర్థిక సాయాన్ని అందించారు. అనంతరం ప్రజలను ఉద్దేశిస్తూ ప్రసంగిస్తూ
స్కిల్ స్కామ్ అంశాన్ని ప్రస్తావించారు.
చంద్రబాబు
అవినీతికి పాల్పడి ఆధారాలతో దొరికిపోయారని చెప్పిన ముఖ్యమంత్రి జగన్, నిస్సిగ్గుగా
కొందరు చంద్రబాబుకు మద్దతు పలుకుతున్నారని మండిపడ్డారు. చట్టం ఎవరికైనా ఒక్కటే
అన్నారు.
45
ఏళ్ళగా చంద్రబాబు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించిన సీఎం జగన్, లేని కంపెనీని
ఉన్నట్లుగా సృష్టించి స్కాం చేశారన్నారు. సాక్ష్యాలు, ఆధారాలు చూపిన తర్వాతే
కోర్టు రిమాండ్ విధించిందన్నారు.
ప్రశ్నిస్తా, ప్రశ్నిస్తా అనే వ్యక్తి,
చంద్రబాబు అవినీతి గురించి ఎందుకు మాట్లాడటం లేదని విమర్శలు గుప్పించారు. ఎల్లో
మీడియా ఎందుకు నిజాలు చూపడం లేదన్నారు. చంద్రబాబు వాటాలు పంచుతాడు కాబట్టే మాట్లాడటం
లేదన్నారు.
లంచాలు తీసుకుంటే తప్పేంటని చెత్తపలుకు రాసేది ఒకడు.. ములాఖత్ లో
మిలాఖత్ చేసుకుని పొత్తు పెట్టుకునేది ఇంకొకడని ఘాటు విమర్శలు చేశారు.
చంద్రబాబు
నడిపిన కథలో ఆయన్ను కాకుండా ఇంకెవరిని అరెస్టు చేయాలన్న జగన్.. రూ.371 కోట్ల
రూపాయల జనం సొమ్ము ఎక్కడికి పోయిందన్నారు.
ఎవరి జేబుల్లోకి ఈ సొమ్మంతా పోయిందో ప్రజలంతా ఆలోచన చేయాలని కోరారు.