వామపక్ష చరిత్రకారులు
ప్రచారం చేసిన అబద్ధాల అడుగు మరోసారి ఊడింది. అయోధ్యలో రామజన్మభూమి ప్రదేశంలో
నిర్మాణాల కోసం తవ్వకాలు జరుపుతున్నప్పుడు మరిన్ని ప్రాచీన ఆలయ శిథిలాలు
బైటపడ్డాయి. వాటిని బట్టి ఆ ప్రాంతంలో కచ్చితంగా మందిరం ఉండేదనీ, దాన్ని ధ్వంసం
చేసారనీ స్పష్టమవుతోంది.
అయోధ్యలో ప్రస్తుతం
రామమందిర నిర్మాణం జరుగుతున్న ప్రదేశంలో తవ్వకాలు జరుపుతున్నప్పుడు అక్కడ అత్యంత
ప్రాచీనమైన శిల్పాలు, స్తంభాలు, చెక్కడాలు బైటపడ్డాయని రామజన్మభూమి తీర్థక్షేత్ర ప్రధాన కార్యదర్శి
చంపత్ రాయ్ వెల్లడించారు. సెప్టెంబర్ 12, 13 తేదీలలో తన ఎక్స్ సోషల్ మీడియా
హ్యాండిల్లో ఆ శిల్పాలు, స్తంభాల ఫొటోలను ట్వీట్ చేసారు.
ఈ శిల్పాలు,
స్తంభాలను గమనిస్తే అంతకుముందు అక్కడ మందిరం ఉండేదని, అది అపురూపమైన
శిల్పసౌందర్యంతో అలరారేదనీ తెలుస్తోంది. దాన్ని ధ్వంసం చేసి ఆ ఆలయ శిథిలాల పైనే
మసీదు కట్టారనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. దాంతో, ఇన్నాళ్ళూ వామపక్ష
చరిత్రకారులు చెప్పుకుంటూ వచ్చిన కబుర్లన్నీ బూటకాలేనని వెల్లడవుతోంది. చంపత్ రాయ్
మూడేళ్ళ క్రితం కూడా, అంటే 2020 మే నెలలో అయోధ్యలోని రామమందిర నిర్మాణ స్థలంలో
లభించిన ప్రాచీన ఆలయ శిథిలాల ఫొటోలను బైటపెట్టారు.
భారత పురావస్తు శాఖ
ఏఎస్ఐ 2003లో అయోధ్యలో తవ్వకాలు చేపట్టిన తర్వాత అలహాబాద్ హైకోర్టుకు ఇచ్చిన
నివేదికలో, అక్కడ ఒక గుడిని ధ్వంసం చేసిన తర్వాత దానిమీదనే మసీదు నిర్మించారని
విస్పష్టంగా తేల్చిచెప్పింది. 272 పేజీల ఆ నివేదికలో ఆఖరి పేజీలో తమ పరిశోధన
సారాంశాన్ని స్పష్టంగా వెల్లడించింది. అదేంటంటే, అలహాబాద్ హైకోర్టు పర్యవేక్షణలో 2003లో
జరిపిన తవ్వకాల్లో ఏఎస్ఐ బృందం అక్కడ ఒక ఆలయ శిథిలాలను కనుగొంది. 1992లో సంఘ్
పరివార్‌కు చెందిన కరసేవకులు వివాదాస్పద నిర్మాణాన్ని కూల్చివేసిన తర్వాత బాబ్రీ
మసీదు కిందభాగంలో ఒక అతిపెద్ద, భారీ ఆలయ నిర్మాణం ఉందని ఏఎస్ఐ కనుగొంది. ఆ
నిర్మాణం 10వ శతాబ్దానికి చెందినదని ఆ నివేదిక పేర్కొంది.
ఆ నివేదిక ప్రకారం అక్కడ
50కి పైగా స్తంభాలు లభ్యమయ్యాయి, వాటిపై హిందువుల వేదవాక్యాలు, హిందూ దేవీదేవతల
మూర్తులు, కమల చిహ్నాలూ చెక్కి ఉన్నాయని ఆ నివేదిక స్పష్టం చేసింది. ‘‘ఆ 50
స్తంభాల అడుగులను పరిశీలిస్తే అవి ఒక భారీ నిర్మాణానికి చెందినవని తెలుస్తోంది.
అవి ఉత్తర భారతదేశపు ఆలయాల్లో ఉండే నిర్మాణ పద్ధతులకు అనుగుణంగా ఉన్నాయి’’ అని ఏఎస్ఐ
నివేదిక కచ్చితంగా చెప్పింది.
ఆ వివరాలను బట్టి
చూస్తే, ప్రాచీన ఆలయాన్ని ధ్వంసం చేసి దానిమీద బాబ్రీమసీదు కట్టారన్న సంగతి
స్పష్టంగా తెలుస్తోంది. అదే విషయాన్ని ఇప్పుడు బైటపడిన ఆలయ శిథిలాలు
నిరూపిస్తున్నాయని చంపత్ రాయ్ బైటపెట్టిన ఫొటోలు చెప్పకనే చెబుతున్నాయి.