జమ్మూకశ్మీర్లోని
బారాముల్లా జిల్లా ఉరీలో ఈ ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు.
కశ్మీర్ జోన్ పోలీసులు తమ ఎక్స్ హ్యాండిల్లో ‘‘ఒక ఉగ్రవాదిని మట్టుపెట్టాం.
సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది’’
అని ట్వీట్ చేసారు.
ఉగ్రవాదులు,
జమ్మూకశ్మీర్ పోలీసులకు మధ్య ఎన్కౌంటర్ ఈ ఉదయం జరిగింది. ఉరీ పట్టణానికి
చేరువలోని హథ్లాంగా ప్రదేశం వద్ద ఈ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది.
మరోవైపు, అనంతనాగ్
జిల్లాలో భారత సైన్యం, జమ్మూకశ్మీర్ పోలీసుల సంయుక్త ఆపరేషన్, ఇవాళ నాలుగవ రోజు కొనసాగుతోంది.
జిల్లాలోని కోకెర్నాగ్ ప్రదేశంలోని గాడోలే అటవీప్రాంతంలో ఉగ్రవాదులు దాగి
ఉన్నారు. అక్కడ ఇద్దరు లేదా ముగ్గురు ఉగ్రవాదులు ఉండి ఉండవచ్చునని భారత అధికారులు
అంచనా వేస్తున్నారు.
కశ్మీర్ అడిషనల్ డీజీపీ విజయ్ కుమార్ శుక్రవారం
నాడు ఎక్స్ హ్యాండిల్లో ‘‘నిర్దిష్టమైన సమాచారం మేరకు ఆపరేషన్ నిర్వహిస్తున్నాం,
ఇద్దరు లేదా ముగ్గురు ఉగ్రవాదులు దాగి ఉన్నారు. వారిని మట్టుపెడతాం’’ అని ట్వీట్
చేసారు.
అనంతనాగ్ జిల్లాలో జరుగుతున్న ఆపరేషన్లో
ఇప్పటివరకు నలుగురు భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు.