తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఉన్న
రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ ఎస్ రాహుల్ భార్య కిరణ్మయి మరణించారు.
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కిరణ్మయి (46) ఈ నెల 14 నుంచీ నగరంలోని ఒక
ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆ క్రమంలో శుక్రవారం ఆమె కన్నుమూసారు.
రాహుల్, కిరణ్మయి దంపతులకు ఇద్దరు కుమార్తెలు.
విషయం తెలిసిన వెంటనే జైళ్ళ శాఖ కోస్తాంధ్ర రేంజ్
డీఐజీ ఎంఆర్ రవికిరణ్, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ జగదీష్ ఆస్పత్రికి వెళ్ళి
రాహుల్‌కు సంతాపం తెలిపారు. భార్య అనారోగ్యం దృష్ట్యా రాహుల్ సెలవు పెట్టారు. ఇప్పుడు
ఆమె మృతి కారణంగా రాహుల్ సెలవును పొడిగిస్తున్నట్టు డీఐజీ రవికిరణ్ ప్రకటించారు.
రాహుల్ తిరిగి విధుల్లో చేరేవరకూ తానే జైలు పర్యవేక్షణ బాధ్యతలు వహిస్తానని ఆయన
స్పష్టం చేసారు. శుక్రవారం రాత్రి కిరణ్మయి మృతదేహాన్ని ఆంబులెన్స్‌లో గుంటూరు
తీసుకువెళ్ళారు.
చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న కారణంగా, ఆయనను
ఇబ్బందులు పెట్టాలనే ఉద్దేశంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా
సూపరింటెండెంట్‌ను సెలవులో పంపించిందంటూ గత రెండురోజులుగా విస్తృత ప్రచారం
జరుగుతోంది. డీఐజీ రవికిరణ్ అలాంటి వార్తలపై తీవ్రంగా మండిపడ్డారు. తమపై ఎలాంటి
ఒత్తిళ్ళూ లేవనీ, రాహుల్ సెలవుకు కారణాలను పట్టించుకోకుండా దుష్ప్రచారం
చేస్తున్నారనీ ఆగ్రహం వ్యక్తం చేసారు.
డీఐజీ రవికిరణ్ రాష్ట్ర
ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సమీపబంధువు అనీ, కడప రేంజ్ డీఐజీగా ఉన్నప్పుడు
వివేకా హత్య కేసులో రిమాండ్ ఖైదీలుగా ఉన్న నిందితులకు రాచమర్యాదలు చేసారనీ,
ఇప్పుడు ఆయనను ఉద్దేశపూర్వకంగానే కోస్తాంధ్ర డీఐజీగానూ, రాజమండ్రి జైలు ఇన్‌ఛార్జ్‌గానూ
నియమించారనీ తెలుగుదేశం వర్గాలు ఆరోపణలు చేస్తున్నాయి.