మణిపూర్‌లో సుమారు నాలుగు నెలలుగా సాగుతోన్న
ఘర్షణల కారణంగా ఇప్పటివరకు 175 మంది మృతి చెందారని రాష్ట్ర ప్రభుత్వం
వెల్లడించింది.
మైతేయీలు, కుకీల మధ్య ఘర్షణల కారణంగా మణిపూర్
నాలుగు నెలలుగా అట్టుడుకుతోంది. ఆ క్రమంలో రాష్ట్రంలో చోటు చేసుకున్న హింసాకాండలో ఇప్పటివరకు
175 మంది మృతి చెందారని రాష్ట్ర పోలీసు విభాగం వెల్లడించింది. 33 మంది
అదృశ్యమయ్యారని, 1,118 మంది గాయపడ్డారని తెలిపింది. చనిపోయిన 175
మందిలో 96 గుర్తుతెలియని మృతదేహాలు ఇంకా మార్చురీలోనే
ఉన్నాయని వెల్లడించింది.
తమను ఎస్టీల్లో చేర్చాలన్న మైతేయీల డిమాండ్‌ను
వ్యతిరేకిస్తూ మే 3న కుకీలు ఆందోళన చేపట్టారు. ఆ ఆందోళన
హింసాత్మకంగా మారింది. మణిపూర్ రాష్ట్రాన్ని మంటల్లోకి నెట్టింది. సాధారణ
పరిస్థితులు నెలకొల్పేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తోన్న
ప్రయత్నాలతో ప్రస్తుతం ఘర్షణలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలో, రాష్ట్ర ప్రభుత్వం
ఆ ఘర్షణలకు సంబంధించిన గణాంకాలను విడుదల చేసింది.
మణిపూర్ సర్కారు లెక్కల ప్రకారం..
5,172 నిప్పటించిన ఘటనలు చోటుచేసుకున్నాయి. నిరసనకారులు 4,786 ఇళ్లు, 386 ప్రార్థనా మందిరాలకు
నిప్పు అంటించారు. రాష్ట్ర ఆయుధాగారం నుంచి 5,668 ఆయుధాలను లూటీ
చేశారు. వాటిల్లో 1,329 ఆయుధాలను పోలీసులు
స్వాధీనం చేసుకున్నారు. భద్రతా బలగాలు 360 బంకర్లను ధ్వంసం చేశారు.
మైదాన, పర్వత ప్రాంతాల మధ్య ఏర్పాటు చేసిన బారికేడ్లను గురువారం తొలగించారు.