మావోయిస్టు
పార్టీ పశ్చిమ కనుమల స్పెషల్ జోన్ కమిటీ సభ్యురాలుగా ఉన్న మురవపల్లి రాజి అలియాస్
సరస్వతిని శ్రీ సత్యసాయి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.
శ్రీసత్యసాయి
జిల్లా సున్నంవారిపల్లి గ్రామానికి చెందిన మురవపల్లి రాజీ అలియాస్ సరస్వతి
ప్రస్తుతం బెంగళూరులో ఉంటూ మావోయిస్టు అజెండా అమలు చేస్తోందని పోలీసులు
పేర్కొన్నారు.
సరస్వతి 1999లో R.Y.F పార్టీలో చేరారని, అప్పటి నుంచి నక్సల్స్ కార్యకలపాల్లో చురుగ్గా
పాల్గొంటున్నారని చెప్పారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, వెస్ట్రన్
ఘాట్స్ స్పెషల్ జోనల్ కమిటీకి ఇంచార్జ్ సంజయ్ దీపక్ రావును 2007 లో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం
ఈమె బెంగళూరులో నివసిస్తూ కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలుగు రాష్ట్రాలలో మావోయిస్టు
అజెండా అమలుకు సహకరిస్తున్నారు.
పార్టీ
కార్యాచరణలో భాగంగా దాడులను రచించడం, యువతను
పార్టీలోకి ఆకర్షించి శిక్షణ ఇవ్వడం, పార్టీకీ విరాళాల సేకరించడంలో సరస్వతి దిట్ట.
ఈమెను ఈ రోజు న్యాయస్థానంలో హాజరు పరిచారు.
మావోయిస్టులు
జనజీవన స్రవంతి లోకి రావాలనుకుంటే స్వచ్ఛందంగా పోలీసుల ఎదుట లొంగిపోవచ్చు అని, ప్రభుత్వం
తరఫున వచ్చే అన్ని సదుపాయాలు కల్పిస్తామని ఎస్పీ ఎస్వీ మాధవరెడ్డి చెప్పారు.
చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు.