జనన
ధ్రువీకరణ పత్రం ఇక నుంచి కీలకంగా మారనుంది. పార్లమెంట్ రూపొందించిన రిజిస్ట్రేషన్
ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్(అమెండ్‌మెంట్)
చట్టం-2023 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. దీంతో అడ్మిషన్లు, డ్రైవింగ్
లైసెన్స్, ఓటర్ లిస్ట్‌లో పేరు నమోదు, ఆధార్ కేటాయింపు, వివాహ రిజిస్ట్రేషన్లు
వంటి వాటికి జనన ధ్రువీకరణ పత్రం తప్పనిసరి కాబోతుంది. ఈ మేరకు కేంద్ర
హోంమంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
భవిష్యత్ లో పేర్కొనే ఇతర అవసరాలకు
బర్త్ సర్టిఫికేట్ అవసరం ఉంటుందని కూడా హోంశాఖ ప్రకటనలో పేర్కొంది.
జనన,
మరణాల నమోదుతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు తాజా చట్టం దోహదం
చేస్తుందని వివరించిన హోంశాఖ, సామాజిక భద్రతతో పాటు ప్రభుత్వ సేవల్లో పారదర్శకతకు
ఈ చర్య ఉపయోగపడుతుందని వెల్లడించింది.
గత
పార్లమెంట్ సమావేశాల్లో ఈ సవరణ బిల్లు చట్టరూపం దాల్చింది. ఆగస్టు 1న లోక్‌సభ ఈ
బిల్లుకు ఆమోదముద్ర వేయగా ఆగస్టు 7న రాజ్యసభ మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. 1969
చట్టాన్ని సవరిస్తూ కేంద్రం ఈ కొత్త చట్టాన్ని చేసింది.
ఈ చట్టం మేరకు జనన, మరణాల నమోదును పర్యవేక్షించే
అధికారం రిజిస్ట్రార్ జనరల్‌కు ఉంటుంది. రాష్ట్రపరిధిలోని ప్రధాన రిజిస్ట్రార్లు,
రిజిస్ట్రార్లు రాష్ట్రంతో పాటు జాతీయ డేటాబేస్ లో వివరాలు నమోదు చేయాల్సి
ఉంటుంది.
రాష్ట్ర, కేంద్ర అధికారులు ఒకే సమాచారాన్ని వేరువేరుగా భద్రపరచాల్సి
ఉంటుంది.
ఉదాహరణకు
ఓ ఆస్పత్రిలో శిశువు జన్మిస్తే , దానిని సంబంధిత అధికారులకు ఆస్పత్రి వర్గాలు
తెలియజేయాల్సి ఉంటుంది. శిశువు తల్లిదండ్రుల ఆధార్ నంబర్లు, ఇతర సమాచారాన్ని అందజేయాలి.
జైలు, హోటలు, లాడ్జి వంటి ప్రదేశాల్లో శిశువు జన్మించినా అదే పద్ధతి పాటించాలి. ఆస్పత్రిలో
మెడికల్ ఆఫీసర్ బాధ్యుడైతే, ఆయా ప్రదేశాల్లో వాటి సూపర్ వైజర్లు సంబంధిత సమాచారం
అందజేయాల్సి ఉంటుంది.