నోబెల్ గ్రహీతలకు అందజేసే నగదు బహుమతిని మరోసారి పెంచారు. ఇటీవల కాలంలో నోబెల్ ఫ్రైజ్ మనీలో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా నోబెల్ బహుమతులు పొందిన వారికి ఇచ్చే మొత్తాన్ని 9.86 లక్షల డాలర్లకు పెంచారు. ఇది 11 మిలియన్ స్వీడిష్ క్రోన్‌లకు సమానం. భారత కరెన్సీలో రూ.8.18 కోట్లకు సమానం. ఈ ఏడాది నుంచి ఒక్కో నోబెల్ బహుమతి విజేతకు రూ.1.36 కోట్లు లభించనున్నాయి. నోబెల్ ఫౌండేషన్ ఆర్థిక స్థితినిబట్టి బహుమతి విలువలను సర్దుబాటు చేస్తున్నారు. ఈ ఏడాది 11 మిలియన్ స్వీడిష్ క్రోన్ లను అందజేయనున్నట్టు అవార్డు ప్రదాతలు తెలిపారు.
2012లో నోబెల్ ఫౌండేషన్ తన ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవాలని నిర్ణయించి ప్రైజ్ మనీని 10 నుంచి 8 మిలియన్ క్రోన్‌లకు తగ్గించారు. మరలా 2017లో ఈ మొత్తాన్ని 9 మిలియన్లకు పెంచారు. 2020లో దాన్ని 10 మిలియన్లకు పెంచారు. గడచిన దశాబ్ద కాలంలో యూరోతో పోల్చుకుంటే స్వీడన్ కరెన్సీ విలువ 30 శాతం కోల్పోయింది. అంటే బహుమతి విలువలు పెరిగినా దాని ప్రభావం పెద్దగా కనిపించకపోవచ్చు.
1901లో నోబెల్ ఫౌండేషన్ మొదలైంది. ప్రారంభంలో సైన్స్, సాహిత్యం, శాంతి రంగాల్లో విశేష కృషి చేసిన వారికి నోబెల్ ప్రైజ్ అందించారు. తరవాత కాలంలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, సాహిత్యం, వైద్యశాస్త్రం, శాంతి, ఆర్థిక రంగాల్లో విశేష సేవలు చేసిన వారికి అందిస్తున్నారు.