అసెంబ్లీ
ఎన్నికల సందర్భంగా మధ్యప్రదేశ్‌లో రాజకీయాలు హోరాహోరీగా సాగుతున్నాయి.
ప్రత్యర్థులకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా అధికార బీజేపీ జాగ్రత్తలు తీసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా
సుడిగాలి పర్యటనలు చేస్తున్న బీజేపీ అగ్రనేతలు ప్రచారంలో మిగతా పార్టీలకంటే
ముందున్నారు.
తాజాగా టికెట్ల కేటాయింపులో కూడా ఆ పార్టీ దూకుడు కొనసాగిస్తోంది.
అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ప్రచారపర్వంలో తీవ్రంగా శ్రమిస్తోన్న కాషాయనేతలు,
వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. 39 మంది అభ్యర్థులతో మొదటి విడత జాబితాను
మధ్యప్రదేశ్ బీజేపీ విడుదల చేసింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్
తోమర్ ఈ జాబితాను ప్రకటించారు. త్వరలో మిగతా స్థానాల అభ్యర్థులు కూడా
ప్రకటిస్తామని ఉమారియాలో మీడియాకు తెలిపారు.
బీజేపీ
కి పోటీగా కాంగ్రెస్, ఆప్ కూడా ప్రచారం ప్రారంభించాయి. ఆమ్ ఆద్మీ పార్టీ పది
స్థానాలకు తన అభ్యర్థులను ప్రకటించింది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, దిల్లీ సీఎం
అరవింద్ కేజ్రీవాల్… సేవడా, గోవిందపూర్, హుజుర్, దిమాని, మొరేనా, పెట్లావాద్,
సిర్మోర్, సిరోంజ్, మహరాజ్‌పూర్ అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు.
ఇటీవల
మధ్యప్రదేశ్ లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ, బినా జిల్లాలో ఆ పార్టీ శ్రేణులు
నిర్వహించిన భారీ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. I.N.D.I.A భాగస్వామ్య పక్షాలను ఇండీ కూటమిగా
ఎద్దేవా చేసిన ప్రధాని మోదీ, సనాతన
ధర్మాన్ని నిర్మూలించే రహస్య అజెండాతో జట్టుకట్టారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పాలనలో
మధ్యప్రదేశ్ ను లూటీ చేశారని మండిపడ్డారు.
మధ్యప్రదేశ్
లో 230 అసెంబ్లీ సీట్లు ఉండగా, ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. 2018 లో జరిగిన
ఎన్నికల్లో కాంగ్రెస్ మెజారీటీ సీట్లలో గెలిచింది. ఆ పార్టీ నేత కమల్ నాథ్ సీఎంగా ప్రమాణ
స్వీకారం చేశారు. రెండేళ్ళపాటు కొనసాగిన ప్రభుత్వం తర్వాత కూలిపోయింది. జ్యోతిరాదిత్య
సిందియాతో పాటు ఆయన మద్దతుదారులుగా ఉన్న 22 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ను వీడి
బీజేపీలో చేరారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో పడి కూలిపోయింది. అనంతరం
నిర్వహించిన బలపరీక్షలో బీజేపీ పాలకపార్టీగా ఎన్నికైంది. శివరాజ్ సింగ్ చౌహన్
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.