స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తరఫు లాయర్లు వేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై విచారణను విజయవాడ ఏసీబీ కోర్టు 19వ తేదీకి వాయిదా వేసింది. మంగళవారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని న్యాయమూర్తి ఆదేశించారు. హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఉండటంతో, విచారణపై ప్రభావం చూపుతుందని న్యాయమూర్తి అభిప్రాయపడినట్టు తెలుస్తోంది.
స్కిల్ డెవలప్మెంట్ పథకంలో నిధుల దుర్వినియోగం జరిగాయని మాజీ సీఎం చంద్రబాబునాయుడుపై ఏపీ సీఐడి కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండుకు తరలించిన సంగతి తెలిసిందే. అక్రమంగా అరెస్టు చేశారంటూ చంద్రబాబు తరఫు నాయవాదులు గురువారంనాడు విజయవాడ ఏసీబీ కోర్టులో మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. కేసును పరిశీలించిన న్యాయమూర్తి విచారణను 19వ తేదీకి వాయిదా వేశారు. ప్రాధమిక ఆధారాలు కూడా లేకుండా తనపై రాజకీయ కక్షతోనే కేసులో ఇరికించి అరెస్టు చేశారని, సీఐడి అధికారులు కనీస ఆధారాలు కూడా చూపడం లేదని పిటిషన్లో పేర్కొన్నారు. కేసు తేల్చేలోపు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని చంద్రబాబు తరఫు న్యాయవాదులు పిటిషన్లో కోరారు.
రాజమండ్రి కేంద్ర కారాగారంలో రిమాండులో ఉన్న చంద్రబాబును కలిసేందుకు ఆయన భార్య భువనేశ్వరికి ములాఖత్ ఇచ్చేందుకు జైలు అధికారులు నిరాకరించారు. వారానికి మూడు సార్లు ములాఖత్‌కు అవకాశం ఉన్నా నిరాకరించడంపై భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు.