అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన కందుల జాహ్నవి గత జనవరిలో మరణించిన చెందిన సంగతి తెలిసిందే. ఆమెను ఢీ కొట్టిన పోలీసు వాహనంలోని అధికారి హేళనగా మాట్లాడిన తీరు తీవ్ర విమర్శలకు దారితీసింది. 2021లో ఉన్నత విద్యనభ్యసించేందుకు జాహ్నవి అమెరికాలో అడుగుపెట్టారు. తాజాగా జాహ్నవి చదువుకున్న అమెరికాలోని నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీ ఆమెకు డిగ్రీ ప్రదానం చేస్తున్నట్టు ప్రకటించింది.
కందుల జాహ్నవి మృతిపై యూనివర్సిటీ ఛాన్సలర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె చనిపోయిన వార్త విని యూనివర్సిటీలోని భారతీయ విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారని ఛాన్సలర్ ఆవేదన వ్యక్తం చేశారు. కష్ట కాలంలో జాహ్నవి కుటుంబానికి అండగా ఉంటామని ప్రకటించారు. ప్రమాద బాధ్యులకు శిక్ష పడుతుందన్నారు. జాహ్నవికి మరణానంతరం డిగ్రీ ప్రదానం చేయాలని నిర్ణయించినట్టు వారు తెలిపారు. జాహ్నవి కుటుంబ సభ్యులకు త్వరలో డిగ్రీ పత్రాలు అందజేయనున్నారు.