సూర్యుడి
రహస్యాలను తెలుసుకునేందుకు ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్-1 లక్ష్యం దిశగా
దూసుకెళ్తోంది. భూ కక్ష్య పెంపు విన్యాసాన్ని ఇస్రో నాలుగోసారి విజయవంతంగా
నిర్వహించింది. బెంగళూరులోని టెలిమెట్రీ
ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ ద్వారా ఆ ఆపరేషన్ ను పూర్తిచేసింది.
మారిషస్,
పోర్టుబ్లెయిర్ లోని ఇస్రో గ్రౌండ్ స్టేషన్లు ఈ ప్రక్రియను పర్యవేక్షించాయి. దీంతో
ఆదిత్య ఎల్ 1 ఉపగ్రహం 256 కిలోమీటర్లు x 121973
కిలోమీటర్ల కక్ష్యలోకి ప్రవేశించింది. తదుపరి కక్ష్య పెంపు విన్యాసాన్ని ఈ నెల 19న
చేపట్టనున్నారు. 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని ఎల్-1 పాయింట్ ను చేరుకోవాలంటే
ఆదిత్య ఎల్-1కు సుమారు నాలుగు నెలల సమయం పడుతుంది.
సెప్టెంబర్
3న మొదటి సారి కక్ష్యను పెంచగా సెప్టెంబర్ 5న రెండోసారి, సెప్టెంబర్ 10న మూడోసారి
విజయవంతంగా ఈ విన్యాసాన్ని దశలవారీగా నిర్వహించారు.
ఆదిత్య స్పేస్ క్రాఫ్ట్ 16 రోజుల పాటు భూ కక్ష్యలో
ప్రయాణించి తగిన వేగాన్ని అందుకుని లాగ్రాంజ్ పాయింట్ దిశగా ప్రయాణాన్ని కొనసాగించాల్సి
ఉంటుంది.
చివరి కక్ష్యలోకి చేరుకున్నాక, ఎల్ 1 పాయింట్ ను చేరుకోవడానికి 110 రోజుల
సమయం పడుతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. సెప్టెంబర్
18న చివరి విన్యాసం తర్వాత ఆదిత్య ఎల్-1
వర్తులాకార కక్ష్య అయిన లాగ్రాంజియన్ పాయింట్ 1కి
చేరేందుకు సిద్ధమవుతుంది.