ప్రపంచ రాజకీయాల్లో మరో భారత సంతతి వ్యక్తి
అధికారంలోకి వచ్చారు. సింగపూర్ అధ్యక్షుడిగా థర్మన్ షణ్ముగరత్నం గురువారం
ప్రమాణస్వీకారం చేసారు.
66 ఏళ్ళ ఆర్థికవేత్త థర్మన్ షణ్ముగరత్నం సింగపూర్
9వ అధ్యక్షుడిగా ప్రమాణం చేసారు. దేశ అధ్యక్ష భవనం ఇస్తానాలో గురువారం జరిగిన కార్యక్రమంలో
ఆయన పదవీబాధ్యతలు స్వీకరించారు. భారత సంతతికే చెందిన న్యాయమూర్తి సుందరేశన్ మీనన్,
షణ్ముగరత్నంతో ప్రమాణం చేయించారు. ప్రభుత్వం, సామాజిక వర్గాలు, స్వచ్ఛంద సంస్థలు
సహా అందరినీ కలుపుకుని పనిచేస్తానని, బహుళ జాతుల సమ్మిళిత సమాజాభివృద్ధికి కృషి
చేస్తానని షణ్ముగరత్నం తన అధ్యక్షోపన్యాసంలో సింగపూర్ ప్రజలకు హామీ ఇచ్చారు.
ఇటీవల జరిగిన సింగపూర్
అధ్యక్ష ఎన్నికల ఫలితాలు సెప్టెంబర్ 1న వెలువడ్డాయి. భారత సంతతికి చెందిన
షణ్ముగరత్నంతో చైనా మూలాలున్న ఎంగ్కోంక్ సాంగ్, తన్కిన్ లియాన్ పోటీపడ్డారు.
మొత్తం 24.8 లక్షల ఓట్లు పోల్ అయ్యాయి, వాటిలో 70.4శాతం ఓట్లు గెలుచుకుని షణ్ముగరత్నం
తిరుగులేని విజయం సాధించారు.