సెప్టెంబర్ 18 నుంచి జరగబోయే పార్లమెంట్
ప్రత్యేక సమావేశాలకు హాజరు కావాలంటూ భారతీయ జనతా పార్టీ తమ ఎంపీలకు విప్ జారీ
చేసింది. అటు ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా తమ ఎంపీలకు విప్ జారీ చేసింది.
ఈ ప్రత్యేక సమావేశాల్లో మొదటి రోజు
పార్లమెంటు 75ఏళ్ళ ప్రస్థానం గురించి చర్చిస్తారు. ఆ తరువాత 5 బిల్లులను ఉభయ సభల
ముందు ప్రవేశపెడతారు. రాజ్యసభ ఇప్పటికే ఆమోదించిన అడ్వొకేట్ల సవరణ బిల్లు 2023,
ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లు 2023 లోక్‌సభలో
ప్రవేశపెడతారు. అలాగే, రాజ్యసభలో ప్రవేశపెట్టిన పోస్టాఫీసుల బిల్లు, ఎన్నికల
కమిషనర్, ఇతర కమిషనర్ల నియామక బిల్లు కూడా లోక్‌సభలో ప్రవేశపెడతారు. ఈ రెండు
బిల్లులనూ రాజ్యసభలో ఆమోదింపజేసుకుని, ఆ తర్వాత లోక్‌సభలో ప్రవేశపెడతారు. అలాగే
లోక్‌సభలో ఇప్పటికే ఆమోదించిన ది రిపీలింగ్ అండ్ అమెండింగ్ బిల్లు 2023ని
రాజ్యసభలో ప్రవేశపెడతారు.
సెప్టెంబర్ 19 వినాయకచవితి పవిత్ర
సందర్భాన్ని పురస్కరించుకుని పార్లమెంటు కొత్త భవనంలోకి సమావేశాలను మారుస్తారు. ఈ పార్లమెంటు
సమావేశాల నేపథ్యంలో సెప్టెంబర్ 17న సాయంత్రం 4.30 గంటలకు అఖిల పక్ష సమావేశం
నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ
ట్వీట్ ద్వారా వెల్లడించారు.