చంద్రయాన్-3
విజయంతో అరుదైన ఘనత సొంతం చేసుకున్న ఇస్రో, మరో రికార్డు కూడా సృష్టించింది. చంద్రయాన్-3
ప్రయోగంలో భాగంగా విక్రమ్ ల్యాండింగ్ ఘట్టాన్ని యూట్యూబ్ ఛానల్లో ఇస్రో
ప్రత్యక్షప్రసారం చేసింది. దీనిని ప్రపంచవ్యాప్తంగా ఏకకాలంలో 80 లక్షల మంది
వీక్షించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా అత్యధికమంది లైవ్ చూసిన రికార్డును
నెలకొల్పింది. ఈ విషయాన్ని యూట్యూబ్ చీఫ్ నీల్ మోహన్ వెల్లడించడంతో పాటు ఇస్రోకు
శుభాకాంక్షలు తెలిపారు. చంద్రయాన్-3
విజయంలో ఉద్విగ్నభరిత క్షణాలకు సంబంధించిన 16 సెకన్ల వీడియో క్లిప్ ను షేర్
చేసింది. దీనిపై ఇస్రో కూడా హర్షం వ్యక్తం చేసింది.
యూట్యూబ్
ఇస్రో ఆఫిషియల్ ఛానల్ కు 45 లక్షల 40 వేలమంది సబ్ స్క్రైబర్లు ఉండగా, ఇప్పటి వరకు 86
వీడియోలను అప్లోడ్ చేసింది. ఇటీవల చేపట్టిన ఆదిత్య ఎల్1 ప్రయోగం కూడా యూట్యూబ్ లో
ప్రత్యక్షప్రసారం చేశారు. అలాగే ఇతర సోషల్ మీడియా వేదికల ద్వారా అప్డేట్స్ ను
ఇస్రో ప్రజలతో పంచుకుంటోంది.
చంద్రయాన్-3
ప్రయోగంలో భాగంగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ అడుగుపెట్టింది. దీంతో
ఈ ఘనత సాధించిన మొదటి దేశంగా భారత్ నిలిచింది.
విక్రమ్
ల్యాండర్, రోవర్ 14 రోజుల పాటు చంద్రుడి ఉపరితలంపై పరిశోధనలు జరిపి, ఇస్రోకు
కీలకమైన సమాచారాన్ని అందజేశాయి.
గత ప్రయోగాలతో పోలిస్తే ఈసారి భారత్ భారీ
విజయాన్నే అందుకుంది.
ప్రస్తుతం
చంద్రుడిపై రాత్రివేళ కావడంతో దక్షిణ ద్రువంలో ఉన్న చంద్రయాన్-3 ల్యాండర్, రోవర్
నిద్రాణ స్థితిలో ఉన్నాయి. ప్రయోగంలో భాగంగా అక్కడ మూలకాల ఉనికిని కూడా కనుగొన్నాయి.
ఉష్ణోగ్రత వివరాలు కూడా అందజేశాయి.
చంద్రునిపై
సూర్యోదయం తర్వాత, ల్యాండర్, రోవర్ తిరిగి మేల్కొనే అవకాశాలు ఉన్నాయి. ఒక వేళ అవి
ఇస్రో అంచనా మేరకు స్పందిస్తే చంద్రుడిపై పరిశోధనలకు మరింత వీలు కుదురుతుంది.
చంద్రయాన్-3
ప్రయోగం విజయవంతం కావడంతో అమెరికా, చైనా, రష్యా, తర్వాత చంద్రునిపై కాలుమోపిన
నాలుగోదేశంగా భారత్ నిలిచింది.