చంద్రబాబు డూప్‌గా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నాడని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. పవన్ మనసులో ఎప్పుడూ చంద్రబాబే ఉంటాడని ఆయన అన్నారు. 2014లో ఓట్ల చీలకుండా ఉండేలా జనసేన పోటీలో నిలబడలేదు, 2019లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చేందుకు జనసేన, టీడీపీ విడివిడిగా పోటీ చేశాయన్నారు. అసలు జనసేన, టీడీపీ ఎప్పుడు విడిపోయాయని సజ్జల ప్రశ్నించారు.
వైసీపీకి ప్రజల్లో 75 శాతం మద్దతు ఉందని, అధికారంలో ఉన్న ఏ పార్టీకి ఈ స్థాయిలో మద్దతు ఉండదని సజ్జల గుర్తుచేశారు. ఎవరెవరు కలసి పనిచేసినా వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 60 శాతం ఓట్లు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజల నుంచి వస్తోన్న మద్దతు చూసిన తరవాతే ఈ మాట చెబుతున్నట్టు సజ్జల చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్దమేనని ఆయన అన్నారు. పవన్ వ్యాఖ్యలను తాము పట్టించుకోమని సజ్జల వ్యాఖ్యానించారు.
స్కిల్ స్కాంలో రూ.350 కోట్లు షెల్ కంపెనీలకు మళ్లించారని ప్రభుత్వ సలహాదారు చెప్పారు. నిధులను డిజైన్ టెక్ కంపెనీకి మళ్లించినట్టు విచారణలో తేలిందని సజ్జల వెల్లడించారు. గుడి, గుడిలోని లింగాన్ని మింగింది చంద్రబాబు ముఠా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు తెలియకుండానే సీమెన్స్‌కు డబ్బులు వెళ్లాయా అని ఆయన ప్రశ్నించారు. ఒప్పందంలో ఎక్కడా రూ.3300 కోట్లు అనేదే లేదన్నారు.జీవోలో ఒకలాగ, ఒప్పందంలో మరోలా రాసుకున్నారని సజ్జల గుర్తుచేశారు. త్వరలో అన్నీ బయటకు వస్తాయన్నారు.
వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు సిద్దహస్తుడని సజ్జల ధ్వజమెత్తారు. అన్ని వేళలా వ్యవస్థలను మేనేజ్ చేయడం కుదరదన్నారు. అడ్డంగా దొరికిపోయి, చంద్రబాబు సుద్దపూస అంటే ప్రజలు నమ్మరని ఆయన అన్నారు. చంద్రబాబు ముఠా చేసే క్యాంపెయిన్లు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. సినిమాల్లో వేసినట్టు డైలాగులు వేస్తే జనం నవ్వుకుంటారని సజ్జల సెటైర్లు వేశారు.