ఒక విషయం స్పష్టమైపోయింది. తెలుగుదేశం, జనసేన
కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తాయన్న సంగతి అధికారికం అయింది. ఆ మేరకు పవన్ కళ్యాణ్
రాజమహేంద్రవరం జైలు ఎదుట విస్పష్టమైన ప్రకటన చేసారు. ఈ కూటమితో బీజేపీ చేతులు
కలుపుతుందా లేదా అన్నది తేలాల్సి ఉంది.
2019 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ ఎన్డీయే
కూటమి నుంచి వైదొలగింది. ఆ సమయంలో నరేంద్రమోదీ, చంద్రబాబు నాయుడుకు జగన్మోహనరెడ్డి
పన్నిన ఉచ్చులో పడుతున్నారంటూ హెచ్చరించారు కూడా. అయినా చంద్రబాబు పట్టించుకోలేదు.
ప్రత్యేక హోదా నుంచి ప్రత్యేక ప్యాకేజీకి మళ్ళిన చంద్రబాబు, మళ్ళీ ప్రత్యేక హోదా
కోరుతూ ఎన్డీయే నుంచి బైటపడ్డారు. జాతీయ స్థాయిలో బీజేపీ హవా తగ్గుతోందన్న
అంచనాలతో కాంగ్రెస్‌కు మద్దతిచ్చారు. ఆ సమయంలో తెలుగుదేశం నాయకులు నరేంద్ర మోదీపై
తీవ్రస్థాయిలో విమర్శలు చేసారు. వ్యక్తిగత విమర్శలకు సైతం పాల్పడ్డారు. చివరికి
2019 ఎన్నికల్లో బీజేపీ గతంలో కంటె భారీ మెజారిటీతో గెలవడంతో తెలుగుదేశానికి పాలుపోని
పరిస్థితి నెలకొంది.
2019 పార్లమెంటు ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే
తెలుగుదేశం తన ఎంపీలను బీజేపీలోకి పంపించేసింది. పరోక్షంగా బీజేపీలో తన వర్గాన్ని
ప్రవేశపెట్టింది. నువ్వు ఒకందుకు ఇస్తే, నేను ఇంకొకందుకు తీసుకుంటా అన్నట్టు బీజేపీ
కూడా వారిని అక్కున చేర్చుకుంది. అయితే రాష్ట్రస్థాయిలో వైఎస్ఆర్సీపీ పట్ల బీజేపీ
తీవ్రస్థాయి శత్రుత్వం ప్రదర్శించకపోవడం తెలుగుదేశానికి ఎంతమాత్రం నచ్చలేదు.
అందుకే, బీజేపీ జాతీయ నాయకత్వాన్ని పన్నెత్తు మాటయినా అనకుండా, రాష్ట్రస్థాయి
నాయకత్వాన్ని మాత్రం జగన్ తొత్తులు అంటూ తెలుగుదేశం నిందిస్తుండేది. చివరికి
పార్టీ అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజుపైన కూడా అదే ప్రచారం కొనసాగించింది. బీజేపీ
నుంచి సానుకూల సంకేతాల కోసం జనసేన పవన్ కళ్యాణ్‌ను వాడుకోడానికి ప్రయత్నించింది.
2014 ఎన్నికల్లో జనసేన ఎన్నికల్లో పోటీ చేయకుండా తెలుగుదేశం,
బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించింది. 2019 ఎన్నికల్లో వామపక్షాలు, బీఎస్పీతో కలిసి
పోటీ చేసింది. 2019 ఎన్నికల తర్వాత మళ్ళీ 2020 జనవరిలో పవన్ కళ్యాణ్ బీజేపీతో
పొత్తు కుదుర్చుకున్నారు. అయినప్పటికీ రాష్ట్రస్థాయిలో బీజేపీ, జనసేన కలిసి
పనిచేసిన దాఖలాలు లేవు. ఒకవైపు బీజేపీతో పొత్తులో ఉంటూనే పవన్ కళ్యాణ్ క్రమం
తప్పకుండా చంద్రబాబు నాయుడుతో చర్చలు జరుపుతూనే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డిని
బూచిగా చూపించి టీడీపీని బీజేపీ కూటమిలోకి తీసుకు వెళ్ళడానికి పవన్ కళ్యాణ్ చాలా
ప్రయత్నాలు చేసారు, కానీ అవేవీ ఫలించలేదు. పవన్ ఢిల్లీ వెళ్ళి వచ్చిన ప్రతీసారీ
ఒక్కోతరహాలో మాట్లాడడం రాజకీయ అయోమయావస్థలో ఉన్నారా అన్న అనుమానాలు కలిగించింది.
కానీ పవన్ లక్ష్యం చంద్రబాబును ఎన్డీయే కూటమిలోకి తీసుకువెళ్ళడమే అన్న విషయంలో
మాత్రం ఏనాడూ ఎలాంటి అనుమానాలూ లేవు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంక ఎనిమిది
నెలల వ్యవధి మాత్రం ఉంది. ఈ సమయంలో స్కిల్ డెవలప్మెంట్ స్కాం పేరుతో వైఎస్ఆర్సీపీ
ప్రభుత్వం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది.
చంద్రబాబుపై కేసు నమోదు చేసినప్పటినుంచీ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రావడానికి,
బాబుకు మద్దతు పలకడానికీ ప్రయత్నాలు చేసినా, జగన్ సర్కారు పడనివ్వలేదు. చివరికి,
చంద్రబాబు నాయుడిని రాజమండ్రి జైల్లో నిర్బంధించాక, ఇవాళ పవన్ కళ్యాణ్ వెళ్ళి ములాఖత్‌లో
బాబుతో మాట్లాడారు. అరెస్టు అక్రమం అంటూ ప్రభుత్వంపై విరుచుకుపడడం, తెలుగుదేశానికి
సంఘీభావం ప్రకటించడం వంటి సాధారణ రాజకీయ ప్రకటనలే ఉంటాయనుకుంటే… చంద్రబాబు, పవన్
కళ్యాణ్… అంతకుమించిన ఝలక్ ఇచ్చారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం గోడల నడుమ
ఎన్నికల పొత్తు కుదుర్చుకున్నారు. ఇకపై కలిసే నడుస్తామనీ, రేపటినుంచే కార్యాచరణ మొదలవుతుందనీ
ప్రకటించారు.
టీడీపీ, జనసేన పొత్తు అనూహ్యం ఏమీ కాదు,
ముందునుంచీ అందరూ అంచనా వేస్తున్నదే. కాకపోతే బీజేపీ ఒప్పుకోకపోవడంతో పవన్ కళ్యాణ్
ఇన్నాళ్ళూ కొంచెం వెనుకముందులాడుతూ వచ్చారు. అందువల్ల పొత్తు ప్రకటన ఎప్పుడు
అన్నదానిపైనే స్పష్టత లేదు. ఇప్పుడు ఆ సందేహం తీర్చేసారు. రాబోయే అసెంబ్లీ
ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేస్తాయని పవన్ కళ్యాణ్ స్పష్టంగా
ప్రకటించేసారు. నిజానికి ఇప్పటికే తాను పొత్తులో ఉన్న బీజేపీ నిర్ణయం
తెలుసుకోకుండానే పవన్ సైకిలెక్కేసారు.
ఇప్పుడు సందేహం అంతా బీజేపీ గురించే. ఎన్డీయే
కూటమిలో ఉంటూనే తెలుగుదేశానికి జైకొట్టిన పవన్ కళ్యాణ్ దారిని బీజేపీ అనుసరిస్తుందా
లేదా అన్నదే ప్రశ్న. చంద్రబాబును జైల్లో పెట్టినప్పటి నుంచీ తెలుగుదేశం వర్గాలు,
కేంద్రానికి తెలియకుండా జగన్మోహన్ రెడ్డి అంత పెద్ద నిర్ణయం తీసుకోలేరనీ, అందువల్ల
బాబు అరెస్టు వెనుక బీజేపీ హస్తముందనీ ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు, చంద్రబాబు
కుటుంబ సభ్యురాలైన పురందరేశ్వరిని ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా చేసినప్పటినుంచీ ఆ
పార్టీ టీడీపీ అనుకూలంగా వ్యవహరిస్తోందని వైసీపీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇక
బీజేపీ నేతలు చంద్రబాబును అరెస్టు చేసిన తీరును తప్పుపడుతున్నారు. తప్పు జరిగి
ఉంటే సరైన పద్ధతిలో విచారణ జరిపి అప్పుడు అరెస్ట్ చేయాలి తప్ప ఇంత హడావుడిగా
అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదంటూ మాట్లాడుతున్నారు. ఇవి దేనికి సంకేతాలు అన్నది
ఇంకా స్పష్టత రావలసి ఉంది. అవి ఎలా ఉన్నా, ఇప్పటికి ఉన్న పరిస్థితులను బట్టి
ఆంధ్రలో బీజేపీ ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగల స్థితిలో అయితే లేదన్నది
నిర్వివాదాంశం.
ఏది ఏమైనా, వైఎస్ఆర్సీపీ ఒకవైపు, టీడీపీ-జనసేన
మరోవైపుగా ఎన్నికల యుద్ధానికి రంగం సిద్ధమైంది. బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలు ఈ
పోరులో నామమాత్రపు పోటీదారులే. చంద్రబాబును జైల్లో పెట్టడం అధికార పక్షానికి
సానుకూలమవుతుందా లేక ప్రతిపక్షానికి సానుభూతి పవనాలను తెచ్చిపెడుతుందా అన్నది వేచి
చూడాల్సిందే.