వైసీపీకి
వ్యతిరేకంగా టీడీపీ, జనసేన కలిసి పోరాడాలని నిర్ణయం తీసుకున్నట్లు నారా లోకేశ్ తెలిపారు.
ప్రజావ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న పాలకపార్టీకి వ్యతిరేకంగా పోరాడాలని చంద్రబాబు
ఆదేశించారని చెప్పారు. 2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడిగా పోరాడాలని
నిర్ణయించినట్లు చెప్పారు.
రాష్ట్రం కోసం, భావి తరాల కోసమే ఈ నిర్ణయం
తీసుకున్నామని పేర్కొన్నారు. స్కిల్ స్కీమ్ స్కామ్ లో జూడిషీయల్ రిమాండ్ లో ఉన్న
చంద్రబాబుతో పవన్ ములాఖత్ సందర్భంగా ఈ పరిణామం చోటుచేసుకుంది.
వైసీపీకి వ్యతిరేకంగా ప్రజాపోరాటాలు చేయడంతో
పాటు ఎన్నికల్లో కలిసి పోటీచేయాలని నిర్ణయించుకున్నట్లు లోకేశ్ చెప్పారు. టీడీపీ,
జనసేన తరఫున కమిటీలు వేయబోతున్నట్లు వెల్లడించారు.
జగన్ చేసే ప్రతి తప్పును
ప్రజాక్షేత్రంలో ఎండగడతాం అన్నారు.
వైసీపీ
ప్రభుత్వంపై నారా లోకేశ్ మండిపడ్డారు. ప్రజల తరఫున, ప్రజల కోసం పోరాడుతున్న వారిపై
అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై 22 కేసులు పెట్టిన
ప్రభుత్వం జనసేన అధినేత పవన్, అమరావతి రాకుండా అడ్డుకున్నారని చెప్పారు. పవన్ కళ్యాణ్ లాంటి
నాయకుడినే రాష్ట్రంలో అడుగుపెట్టకుండా అడ్డుకున్నారంటే సామాన్యుడి పరిస్థితేంటని
లోకేశ్ ప్రశ్నించారు.
వైసీపీ నేతలు చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే
ఎలాంటి చర్యలు తీసుకోని పోలీసులు, విపక్షనేతలపై మాత్రం తప్పుడు కేసులు
పెడుతున్నారని ఆరోపించారు.
యువగళం
పాదయాత్ర శాంతియుతంగా జరుగుతున్నప్పటికీ తమ వాలంటీర్లపై కేసులు పెట్టి జైల్లో
పెట్టారని చెప్పారు.
రాష్ట్రాభివృద్ధి కోసం ఏం చేయాలనేదానిపై పవన్,
చంద్రబాబు చర్చించారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు నందమూరి బాలకృష్ణ తెలిపారు. ప్రజా
సంక్షేమాన్ని గాలికొదిలేసి, ప్రతిపక్షాలపై దాడికి పాల్పడే వ్యక్తి ముఖ్యమంత్రిగా
ఉండటం మన దౌర్భాగ్యం అని విమర్శించారు. జైల్లో ఉన్నప్పటికీ చంద్రబాబు రాష్ట్రం
గురించే ఆలోచిస్తున్నారని చెప్పారు. దేశం మొత్తం చంద్రబాబు అరెస్టును
తప్పుబడుతోందన్నారు.