‘సనాతన ధర్మం’ వివాదంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ కీలక వ్యాఖ్యలు
చేశారు. ప్రతిపక్షాల ఐఎన్డీఐ కూటమి సనాతన ధర్మాన్ని అంతం చేయాలనుకుంటోందని
మండిపడ్డారు. గురువారం మధ్యప్రదేశ్‌లోని బినాలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం
సందర్భంగా మాట్లాడుతూ ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘ప్రతిపక్షాల కూటమి ఇటీవల ముంబయిలో సమావేశమయింది. ‘ఘమండియా’
కూటమిని నడపడానికి వారు వ్యూహాలను సిద్ధం చేసుకొన్నారు. అక్కడే సనాతన సంస్కృతిని
అంతం చేయడానికి తీర్మానం చేసారు. భారత సంస్కృతిపై దాడి చేయడమే వారి వ్యూహం. వేల
ఏళ్లుగా దేశాన్ని ఏకం చేసిన భారతీయుల విశ్వాసాలు, సంప్రదాయాలపై
దాడి చేయాలని వారు నిర్ణయానికొచ్చారు. లోకమాన్య తిలక్, స్వామి
వివేకానంద వంటివారికి స్ఫూర్తినిచ్చిన సనాతన ధర్మాన్ని అంతం చేయాలనుకుంటున్నారు’
అంటూ మోదీ మండిపడ్డారు.
ఇక, జి-20 సదస్సు విజయం 140 కోట్లమంది
భారతీయులకు చెందుతుందని ప్రధానమంత్రి చెప్పారు. జి-20 నిర్వహణ ఈ దేశ సామూహిక
శక్తికి ఉదాహరణ అని మోదీ వ్యాఖ్యానించారు. మన దేశంలో
భిన్నత్వం, సాంస్కృతిక సంపదను చూసి జి-20నేతలు ఆశ్చర్యపోయారని చెప్పుకొచ్చారు.
ఒక దేశం లేక రాష్ట్రం అభివృద్ధిపథంలో పయనించాలంటే
ప్రభుత్వాలు పూర్తి పారదర్శకతతో వ్యవహరించాలని, అవినీతికి
అడ్డుకట్ట వేయాలనీ మోదీ అన్నారు. గతంలో మధ్యప్రదేశ్‌ను వెనకబడిన రాష్ట్రంగా
చెప్పేవారని మోదీ గుర్తు చేసారు. స్వాతంత్ర్యం వచ్చాక మధ్యప్రదేశ్‌ను సుదీర్ఘకాలం
పాలించిన ప్రభుత్వాలు అవినీతి, నేరాలు తప్ప ఇంకేం ఇవ్వలేదంటూ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు.
మధ్యప్రదేశ్ ప్రజలను కలిసి
మాట్లాడేందుకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్చౌహాన్కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు
చెప్పాలనుకుంటున్నాను. ఈ రోజు రూ.50 వేల కోట్ల విలువైన
అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశాం. ఈ మొత్తం కొన్ని రాష్ట్రాల బడ్జెట్
కంటే కూడా ఎక్కువ’ అని మోదీ వెల్లడించారు.