జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజమండ్రి కేంద్ర కారాగారంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో ములాఖత్ అయ్యారు. స్కిల్ డెవలప్మెంట్ పథకంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ చంద్రబాబు రాజమండ్రి జైల్లో రిమాండులో ఉన్న సంగతి తెలిసిందే. రిమాండులో ఉన్న చంద్రబాబును జనసేనాని ఇవాళ మధ్యాహ్నం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. అనంతరం జైలు బయట మీడియాతో కాసేపు మాట్లాడారు.
నాలుగున్నరేళ్లుగా ఏపీలో అరాచకపాలన సాగుతోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధ్వజమెత్తారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసి రిమాండుకు పంపించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అవినీతి బురదలో మునిగిపోయి, ఆ బురదను సీఎం జగన్మోహన్రెడ్డి అందరికీ అంటించాలని చూస్తున్నాడని పవన్ విమర్శించారు.
2019లో జనసేన ఒంటరిగా పోటీ చేయాలని తాను తీసుకున్న నిర్ణయంతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారని ఆయన గుర్తుచేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ కలసి పోటీ చేయనున్నట్టు జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. త్వరలో దీనిపై కార్యాచరణ ప్రకటించనున్నట్టు తెలిపారు. 2020 విజన్ గురించి పాతికేళ్ల కిందటే చంద్రబాబు చెబితే చాలా మంది విమర్శించారని, నేడు సైబరాబాద్ సిటీలో లక్షలాది మందికి ఉద్యోగాలొచ్చాయన్నారు. రాష్ట్ర భవిష్యత్ కోసం జనసేన, టీడీపీ కలసి పోటీ చేస్తాయని పవన్ పునరుద్ఘాటించారు.
చంద్రబాబు అక్రమ అరెస్టు గురించి ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళతానని పవన్ చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ పథకం ముందుగా గుజరాత్లో మొదలైందని, దీని ద్వారా వేలాది మందికి శిక్షణ ఇచ్చారని, చాలా మందికి ఉద్యోగాలు కూడా వచ్చాయన్నారు. ఆర్థిక నేరాలను ఈడీ విచారణ చేయాల్సి ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుని అక్రమ కేసులు పెడుతోందని పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు.
వాలంటీర్లను అడ్డుపెట్టుకుని డేటా చౌర్యానికి పాల్పడుతున్నారని జనసేనాని తప్పుపట్టారు. మద్యం అమ్మకాల్లో డిజిటల్ పేమెంట్లు లేకుండా చేసి అడ్డగోలుగా దోచుకుంటున్నారని సీఎం జగన్ రెడ్డిపై ధ్వజమెత్తారు. ఇసుకలో వేల కోట్లు కాజేస్తున్నారన్నారు. ఏపీలో శాంతి భద్రతలు లేవని, తనను సరిహద్దుల్లోనే ఆపేస్తున్నారని, కారులోంచి కూడా బయటకు రాకూడదని హుకుం జారీ చేస్తున్నారని పవన్ విమర్శించారు. 30 ఏళ్లు అధికారంలో ఉంటామన్న వ్యక్తిలో ఉలుకుపాటు మొదలైందని, చంద్రబాబు భద్రత విషయాన్ని ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా దృష్టి తీలుకెళతానన్నారు. యుద్దం కావాలని కోరుకుంటే అందుకు సిద్దంగా ఉన్నట్టు పవన్ ప్రకటించారు.