తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును
రాజకీయ కక్షసాధింపుల్లో భాగంగానే అరెస్టు చేసినట్టు అర్ధమవుతోందని బీజేపీ జాతీయ
ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. తెలంగాణలోని కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రిని అంత
ఆదరాబాదరాగా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.
ఎవరైనా తప్పుచేస్తే అరెస్ట్ చేయడాన్ని ఎవరూ
కాదనరనీ, అయితే కనీసం ఎఫ్ఐఆర్లో కూడా పేరు లేని వ్యక్తిని ఎలా అరెస్ట్ చేసారో తనకు
అర్ధం కావడం లేదని బండి సంజయ్ అన్నారు. ఈ అరెస్ట్ ద్వారా చంద్రబాబు నాయుడుకు
ఆంధ్రాప్రజల్లో మంచి మైలేజ్ వచ్చిందని సంజయ్ వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్సీపీ వైఖరి
ఇలాగే కొనసాగితే త్వరలోనే ప్రజలు తిరగబడే పరిస్థితి వస్తుందని సంజయ్
అభిప్రాయపడ్డారు. జి-20 సమావేశాలు జరుగుతున్నప్పుడే చంద్రబాబునాయుడును అరెస్ట్
చేయడానికి సమయం దొరికిందా అని ప్రశ్నించారు. తప్పును తప్పు అని చెబితే చంద్రబాబు
ఏజెంట్ అనే ముద్ర వేయడం వైఎస్ఆర్సీపీ నేతలకు అలవాటయిపోయిందని విమర్శించారు.
ఇంతకుముందు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు
కె లక్ష్మణ్ కూడా చంద్రబాబును అరెస్ట్ చేసిన తీరును తప్పుపట్టారు. సోమవారం నాడు ఆయన
ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ఎలాంటి వివరణా అడగకుండా, ఎఫ్ఐఆర్లో పేరు లేకుండా
మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం సరికాదని వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ
అధ్యక్షురాలు పురందరేశ్వరి కూడా బాబును అరెస్టు చేసిన తీరును దుయ్యబట్టారు.