కేరళలో నిఫా వైరస్ కలకలం సృష్టిస్తోంది. దీన్ని బంగ్లాదేశ్ వేరియంట్‌గా గుర్తించారు. నిఫా వైరస్ వల్ల ఇప్పటికే ఇద్దరు చనిపోయారని కేరళ ప్రభుత్వం ప్రకటించింది. మరో ముగ్గురు నిఫా భారిన పడ్డారు. కేరళలోని కోజికోడ్ జిల్లాలోని అటాన్చేరి, మారుతోంకర, తిరువళ్లూరు, కుట్టియాడి, కాయక్కోడి, కవిలుంపర, విల్యపల్లి గ్రామాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. నిఫా గుర్తించిన గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
కన్నూర్, వయనాడ్, మలప్పురం జిల్లాల్లోనూ ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తం అయ్యారు. వైరస్ నిర్ధారణను వేగవంతం చేసేందుకు శాంపిల్స్ తీసుకుని పుణేలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించారు. కోజికోడ్ మెడికల్ కళాశాలలో క్యాంపులు ఏర్పాటు చేసి అనుమానితులను పరీక్షిస్తున్నారు.
అనుమానితులను ఐసోలేషన్ గదుల్లో ఉంచుతున్నట్టు కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. బుధవారంనాడు తాజాగా మరో వ్యక్తికి నిఫా సోకినట్టు గుర్తించారు. చెన్నైలోని ఐసీఎంఆర్ ఎపిడమిక్ బృందాలు కోజికోడ్ చేరుకున్నాయి. నిఫా సోకిన బాధితులకు సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించి పరీక్షలు నిర్వహిస్తున్నారు.