జమ్మూకాశ్మీర్ అనంతనాగ్ జిల్లాలో బుధవారం రాత్రి జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు భద్రతా సిబ్బంది చనిపోయారు. తీవ్రవాదులతో జరిగిన ఎదురు కాల్పుల్లో కల్నల్ మన్‌ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్ ధోనాక్, డిప్యూటీ సూపరింటెండెంట్ హుమయూన్ భట్ చనిపోయారు. వీరితోపాటు ఓ జవాన్ కూడా మృతి చెందారు. మరొకరి ఆచూకీ లభించలేదని అధికారులు తెలిపారు.
కల్నల్ మన్‌ప్రీత్ సింగ్ ఉత్తమ సేవలకు గతంలో సేన మెడల్ లభించిందని ఆయన బావ వీరేంద్ర గిల్ గెలిపారు. కల్నల్ సింగ్ 19 రాష్ట్రీయ రైఫిల్స్‌కు కమాండింగ్ అధికారిగా ఉన్నారు. ఎన్కౌంటర్ జరిగిన అనంతనాగ్‌లోని కోకెర్నాగ్ ప్రాంతంలోని అడవుల నుంచి అధికారుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.
ఉగ్రవాదుల కదలికలపై నిర్దిష్టమైన సమాచారం మేరకు మంగళవారం సైన్యం, పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టినట్టు తెలుస్తోంది. జేకే పోలీస్ డిప్యూటీ సూపరింటెండెంట్ నేతృత్యంలోని దళాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ముగ్గురు అధికారులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించడం కూడా కష్ట సాధ్యంగా మారడంతో వారు అక్కడే చనిపోయారని తెలుస్తోంది. ఉగ్రవాదులు వరుస కాల్పులకు దిగడంతో ముగ్గురు భద్రతా సిబ్బంది మృతిచెందారు.