లిబియా దేశంలో డేనియల్ తుఫాను బీభత్సం సృష్టించింది. తుఫాను ప్రభావంతో కురిసిన అతి భారీ వర్షాలకు డ్యాములు తెగిపోవడంతో జల ప్రళయం సంభవించింది. దీంతో 5300 మంది పౌరులు చనిపోయినట్టు అధికారులు వెల్లడించారు. మరో 11 వేల మంది ఆచూకీ లభించడం లేదని లిబియా ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే 2 వేల మృత దేహాలను గుర్తించారు. వరద దాటికి రెండు డ్యాములు కొట్టుకుపోవడంతో భారీగా ప్రాణనష్టం వాటిల్లింది.
లిబియాలోని డెర్నా పట్టణంలో ఎక్కువ నష్టం జరిగిందని అధికారులు తెలిపారు. సముద్ర తీర పర్వత ప్రాంతంలో డెర్నా నగరం ఉంది. వేలాది నివాసాలు పర్వత లోయల్లో ఉన్నాయి. సమీపంలోని ప్రాజెక్టు తెగిపోవడంతో డెర్నా నగరాన్ని అర్థరాత్రి వరదనీరు ముంచెత్తింది. ప్రజలు తప్పించుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. వేలాది మంది సమీపంలోని సముద్రంలోకి కొట్టుకుని పోయి ఉంటారనే ఆందోళన వ్యక్తం అవుతోంది.
నియంత గఢారీని నాటో దళాలు మట్టుపెట్టిన తరవాత లిబియాలో పాలనా సంక్షోభం నెలకొంది. ఇది కూడా ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు. అక్కడ రెండు ప్రభుత్వాలు నడుస్తున్నాయి. అబ్దుల్ హమీద్ బీబా రాజధాని ట్రిపోలి నుంచి పాలన సాగిస్తున్నారు. ఆయన ప్రభుత్వాన్ని ప్రపంచ దేశాలు గుర్తించాయి. తూర్పు ప్రాంతం బెంఘాజీ నుంచి ఒసామా హమద్ పాలిస్తున్నారు. వరద ప్రాంతాల్లో కనీస సహాయక చర్యలు కూడా కొనసాగడం లేదు. సహాయక చర్యలు అంతంత మాత్రంగా కొనసాగుతున్నాయని అంతర్జాతీయ మీడియా ద్వారా తెలుస్తోంది. వరదలో కొట్టుకుపోయిన డ్యామ్ 1970లో నిర్మించినట్టు తెలుస్తోంది. సరైన నిర్వహణ లేకపోవడం వల్లే డ్యామ్ బద్దలైందని తెలుస్తోంది.