స్కిల్ స్కామ్ కేసులో మాజీ సీఎం చంద్రబాబు అరెస్టే తప్పన్నట్టుగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. స్కిల్ స్కామ్లో జరిగిన అవినీతి ఆధారాలను ఆయన తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో మీడియాకు వివరించారు. స్కిల్ స్కాంలో నేరుగా ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ సొమ్ము దోచుకోవడానికే స్కిల్ డెవలప్మెంట్ పథకం తెచ్చారని సజ్జల తప్పుపట్టారు.
స్కిల్ డెవలప్మెంట్ పథకంలో వందల కోట్ల అవినీతి జరిగిందని సిఐడి రిపోర్ట్ ఇచ్చిందని సజ్జల గుర్తుచేశారు. నేషనల్ ఏజన్సీలు కూడా అవినీతి జరిగినట్టు రిపోర్ట్ ఇచ్చాయన్నారు. 2019లోనే సీమెన్స్ రిపోర్ట్ ఇచ్చిందని, అప్పటి ప్రభుత్వంతో ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని వారు చెప్పినట్టు సజ్జల మీడియాకు చెప్పారు. ప్రభుత్వం నుంచి నేరుగా నిధులు డిజైన్ టెక్ కంపెనీకి, అక్కడ నుంచి షెల్ కంపెనీలకు మళ్లించారని ఆయన వెల్లడించారు.
చంద్రబాబును జైల్లో వేయడమే నేరం అన్నట్టు టీడీపీ నాయకులు మాట్లాడటం విడ్డూరంగా ఉందని సజ్జల ఎద్దేవా చేశారు. చంద్రబాబును హింసిస్తున్నారంటూ తప్పడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ నాయకుల ప్రచారంతో అసలు విషయం పక్కకు పోతోందన్నారు. కోర్టు కూడా అవినీతి జరిగిందని అంగీకరించిన తరవాత, టీడీపీ నేతలు ఎందుకు రాద్దాంతం చేస్తున్నారో తెలియడం లేదని సజ్జల మండిపడ్డారు.