కార్లలో ఎయిర్‌బ్యాగులు ఎన్ని ఉండాలనే దానిపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. కార్లకు ఆరు ఎయిర్‌బ్యాగులు తప్పనిసరి చేయబోతున్నారంటూ మీడియాలో వస్తోన్న వార్తలను కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఖండించారు. కార్లలో ఆరు ఎయిర్‌బ్యాగులు తప్పనిసరి చేయాలనే ఆలోచన లేదని గడ్కరీ తెలిపారు.
కార్లలో ప్రయాణీకుల భద్రతా ప్రమాణాలకు రేటింగ్ ఇచ్చేందుకు న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ తీసుకొచ్చినట్టు గడ్కరీ చెప్పారు. కారుకు 5 స్టార్ రేటింగ్ లభించాలంటే 6 ఎయిర్‌బ్యాగులు ఉండాలని సూచించారు. మెరుగైన రేటింగ్ అందుకోవాలనుకునే కంపెనీలు ఆరు ఎయిర్‌బ్యాగులు అమర్చాల్సి ఉంటుంది. అయితే ఆరు బ్యాగులు తప్పనిసరి చేయడం లేదన్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో ప్రయాణీకుల ప్రాణాలను ఎయిర్‌బ్యాగులు కాపాడతాయనే విషయం తెలిసిందే.
ప్రయాణీకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆరు ఎయిర్‌బ్యాగులు తీసుకురానున్నట్టు గత ఏడాది గడ్కరీ చెప్పారు. దీనిపై కార్ల తయారీదారుల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. దీనిపై పునరాలోచన చేసిన కేంద్రం ఆరు ఎయిర్‌బ్యాగులు తప్పనిసరి కాదని ప్రకటించింది.