తమిళనాడు నీలగిరి జిల్లాలో రెండు పులులు
అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించాయి. ఆ ఘటనపై అటవీశాఖ అధికారులు విచారణ
చేపట్టారు. అసలు కారణం తెలిసి విస్తుపోయారు. పులులకు విషం పెట్టిన వ్యక్తిని
కనుగొని, అదుపులోకి తీసుకున్నారు.
నీలగిరి జిల్లాలోని అటవీప్రాంతంలో
నీటికుంట దగ్గర రెండు పులులు కొద్దిపాటి దూరంలో పడి ఉన్నాయి. అవి రెండూ చనిపోయి
ఉన్నాయి. వాటిని గమనించిన అటవీ శాఖ అధికారులు అసలేం జరిగిందో తెలుసుకోడానికి
విచారణ చేపట్టారు. ఆ పులులకు చేరువలోనే ఒక ఆవు కూడా చనిపోయి పడివుంది. ఆ మూడింటి
కళేబరాలనూ ఫోరెన్సిక్ అనాలసిస్ కోసం కోయంబత్తూరు పంపించారు.
ఫోరెన్సిక్ అనాలసిస్లో ఆ మూడు జంతువుల
కళేబరాల్లో పురుగుమందుల అవశేషాలు ఉన్నట్టు తేలింది. విషపూరితమైన ఆవు కళేబరాన్ని
పులులు తినడం వల్లనే అవి చనిపోయినట్టు నిర్ధారణ అయింది. దాంతో అసలు ఆ ఆవు ఎవరిది.
దాని కళేబరంలోకి పురుగుమందులు ఎలా వచ్చాయి అని తెలుసుకోడానికి అటవీశాఖ అధికారులు
ప్రయత్నించారు. దాని యజమానిని కనుగొని, ప్రశ్నించారు.
ఆ చనిపోయిన ఆవు శేఖర్ అనే ఒక రైతుది. తన
ఆవుని పులి పది రోజుల క్రితం చంపేసిందని శేఖర్ గుర్తించాడు. తనకు నష్టం కలిగించిన
పులి మీద కక్ష తీర్చుకోవాలనుకున్నాడు. పులి ఆవును చంపిన చోటుకు చేరుకున్నాడు. ఆ
ఆవు కళేబరాన్ని తినడానికి పులి మళ్ళీ వస్తుందని గ్రహించాడు. దాంతో ఆవు కళేబరం మీద
పురుగుమందు జల్లాడు. శేఖర్ ఊహించినట్టే పులులు వచ్చాయి. ఆవు కళేబరాన్ని తిన్నాయి.
ప్రాణాలు కోల్పోయాయి.
శేఖర్ చేసిన పని గురించి తెలుసుకున్న
అటవీ అధికారులు విస్తుపోయారు. అంతరించిపోతున్న జంతువుల జాబితాలో ఉన్న పులులను ఉద్దేశపూర్వకంగా
చంపిన నేరానికి అతన్ని అదుపులోకి తీసుకున్నారు.