పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఈ నెల 19 నుంచి కొత్త భవనంలో జరగనున్నాయి. ప్రత్యేక సమావేశాల ఎజెండా ఇంకా ఖరారు కానప్పటికీ ఈ నెల 19న గణేష్ చతుర్థినాడు సమావేశాలు పార్లమెంట్ కొత్త భవనంలోకి మారనున్నాయి. కొత్త భవనంలో పార్లమెంటు సిబ్బంది డ్రెస్ కోడ్ కూడా మారనుంది. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ డిజైన్ నూతన దుస్తులను డిజైన్ చేసింది. గత పార్లమెంటు సమావేశాల్లోనే డ్రెస్ కోడ్ మారాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది.
పురుష సిబ్బందికి సూట్‌కు బదులుగా మెజెంటా, డీప్ పింక్ జాకెట్, తామర పువ్వు డిజైన్ కలిగి ఉండే షర్ట్ ధరిస్తారు. ఖాకీ రంగు ఫ్యాంటు ధరించి కనిపించనున్నారు. ఇక మహిళా సిబ్బంది గతంలో మాదిరే చీర యూనిఫాం ధరిస్తారు. డ్రెస్ కోడ్ మారిన తరవాత ఉభయసభల్లో మార్షల్స్ మణిపురి తలపాగా ధరిస్తారు. భవనం లోపల భద్రతా సిబ్బంది ధరించే సఫారీ సూట్ల స్థానంలో మిలటరీ డ్రెస్ తరహా దుస్తులు ధరించనున్నారు.
నూతన పార్లమెంటు భవనాన్ని ప్రధాని మోదీ గత మే 28న ప్రారంభించారు. పార్లమెంట్ కొత్త భవనాన్ని ఆత్మనిర్బర్ భారత్‌కు నిదర్శనంగా ప్రధాని మోదీ అభివర్ణించారు. దేశం యొక్క అభివృద్ధి ప్రయాణంలో కొన్ని క్షణాలు చిరస్థాయిగా చిలిచిపోతాయని, ఇందుకు పార్లమెంటు కొత్త భవనం సాక్ష్యంగా నిలుస్తోందని ప్రారంభోత్సవంనాడు ప్రధాని మోదీ అన్నారు.
భవిష్యత్తు అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకుని నూతన పార్లమెంటు భవనాన్ని నిర్మించారు. కొత్త లోక్‌సభ భవనంలో 888 మంది, రాజ్యసభలో 384 మంది సభ్యులు కూర్చొనే విధంగా తీర్చిదిద్దారు. ఇక ఉభయ సభల సంయుక్త సమావేశం లోక్‌సభ ఛాంబర్లో నిర్వహించనున్నారు.