జీ20 సమావేశాలు ముగిసిన వేళ ఢిల్లీలో చైనా ప్రతినిధులు బస చేసిన ఫైవ్ స్టార్ హోటల్ గదుల్లోని బ్యాగుల్లో అనుమానాస్పద వస్తువులు కలకలం రేపాయి. సాధారణంగా ఫైవ్ స్టార్ హోటళ్లు చెకింగ్ లేకుండా బ్యాగులను లోపలకు అనుమతించవు. అయితే జీ20 సమావేశాల సందర్బంగా ప్రతినిధుల గౌరవార్దం బ్యాగులను చెక్ చేయకుండానే ఫైవ్ స్టార్ హోటళ్ల గదుల్లోకి అనుమతించారు.
చైనా ప్రతినిధులు రూములు ఖాళీ చేసే సమయంలో వారి బ్యాగులో హోటల్ సిబ్బంది అనుమానాస్పద వస్తువులను గమనించారు. ఈ విషయం రక్షణ సిబ్బందికి చేరవేశారు. దీంతో వారి గదుల వద్ద రక్షణ బలగాలను 12 గంటల పాటు కాపలాగా ఉంచారు. బ్యాగులు స్కాన్ చేసేందుకు చైనా ప్రతినిధులు అంగీకరించకపోవడంతో ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్లో 12 గంటల హై డ్రామా నడిచింది.
విదేశీ దౌత్యానికి సంబంధించిన బ్యాగులు అంటూ చైనా ప్రతినిధులు ప్రకటించారు. అయితే బ్యాగులను చైనా ఎంబసీకి పంపడానికి అంగీకరించిన తరవాత వివాదానికి పరిష్కారం లభించింది. బ్యాగులు పరిశీలించేందుకు మొదట చైనా ప్రతినిధులు తిరస్కరించడం, రక్షణ బలగాలు 12 గంటల పాటు బ్యాగులను విడిచిపెట్టకపోవడంతో ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్లో మంగళవారం 12 గంటల పాటు హై డ్రామా నడిచింది.
జీ20 సమావేశాలకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ దూరంగా ఉన్నారు. చైనా ప్రతినిధి బృందానికి లీ కియాంగ్ నాయకత్వం వహించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధిలో సవాళ్లను పరిష్కరించడానికి జీ20 కూటమికి ఎల్లప్పుడూ సహకరిస్తుందని చైనా ప్రకటించిన సంగతి తెలిసిందే.