చంద్రబాబు భద్రతపై భయాలు ఉన్నాయని ఆయన భార్య భువనేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. స్కిల్ డెవలప్మెంట్ అవినీతి కేసులో రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబును ఆయన కుటుంబ సభ్యులు కలిశాయి. భార్య భువనేశ్వరి, తనయుడు నారా లోకేష్, కోడలు బ్రాహ్మణి చంద్రబాబును కలిశారు. ఆయన జీవితం మొత్తం ప్రజా సేవకే అంకితం చేశారని, కుటుంబం కన్నా తెలుగు ప్రజల కోసమే ఆయన కష్టపడ్డారని భువనేశ్వరి తెలిపారు. జైలు నుంచి త్వరగా బయటకు వచ్చి ప్రజా సేవ చేయడానికి ఆయన సిద్దంగా ఉన్నారని ఆమె చెప్పారు.
ప్రజలే తనకు ముఖ్యమని, వారి హక్కుల కోసమే తన పోరాటమని చంద్రబాబు ఎప్పుడూ చెబుతూ ఉంటారని భువనేశ్వరి గుర్తు చేశారు. తనకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని, అందరూ ధైర్యంగా ఉండాలని చంద్రబాబు చెప్పినట్టు భువనేశ్వరి మీడియాకు వెల్లడించారు. మంగళవారం సాయంత్రం చంద్రబాబుతో ఆయన కుటుంబీకులు 40 నిమిషాలపాటు ములాఖత్ అయ్యారు. ములాఖత్ తరవాత రాజమండ్రి జైలు బయట భువనేశ్వరి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు జైలులో సరైన వసతులు కల్పించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.