డీజిల్ కార్ల తయారీ పరిశ్రమలకు పెద్ద కుదుపు తప్పేలా లేదు. కార్ల ఉత్పత్తిదారులు డీజిల్ కార్ల తయారీ తగ్గించకపోతే ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని కేంద్ర ఉపరితల రవాణా మంత్రి గడ్కరీ హెచ్చరించారు. డీజిల్ వాహనాల వినియోగం తగ్గించేందుకు పన్నులు పెంచడం, వాటి అమ్మకాలను కష్టం చేయడం తప్ప ప్రభుత్వానికి వేరే మార్గం లేదని కార్ల తయారీదారులకు ఓ హెచ్చరికలా కేంద్ర రవాణా మంత్రి గడ్కరీ చెప్పారు. డీజిల్ కార్ల తయారీని నిలిపివేయండి మీరు నిలిపివేయకుంటే వాటి తయారీ అమ్మకాలు కఠినతరం అయ్యేలా పన్నులు పెంచాల్సి ఉంటుందని గడ్కరీ న్యూఢిల్లీలో జరిగిన 63వ వార్షిక సియామ్ సమావేశంలో కుండబద్దలు కొట్టారు.
డీజిల్ వాహనాలపై అదనంగా 10 శాతం జీఎస్టీ విధించబోతున్నారంటూ మీడియాలో వస్తోన్న వార్తలను గడ్కరీ ఖండించారు. అలాంటి ప్రతిపాదన కేంద్రం వద్ద లేదన్నారు. 2070 నాటికి జీరో కార్బన్ సాధించాలనే నిబంధనల మేరకు కేంద్రం పనిచేస్తోందని గడ్కరీ స్పష్టం చేశారు. డీజిల్ వల్ల కలిగే వాయు కాలుష్యం తగ్గించడంతోపాటు, ఆటోమొబైల్ అమ్మకాలు వేగంగా పెంచడానికి, హరిత ఇంధనాల వినియోగం పెంచాల్సిన అవసరాన్ని ఆయన గుర్తుచేశారు.
ప్రస్తుతం ఆటోమొబైల్స్ అమ్మకాలపై 28 శాతం జీఎస్టీతోపాటు అదనపు సెస్ 1 నుంచి 22 శాతం వసూలు చేస్తున్నారు. లగ్జరీ కార్లపై 28 శాతం జీఎస్టీ, అదనంగా 22 శాతం సెస్ విధించారు. కాలుష్యం ఎక్కువగా వెదజల్లే డీజిల్ కార్ల వినియోగం గడచిన తొమ్మిదేళ్లలో 53 శాతం నుంచి 18 శాతానికి పడిపోవడం శుభ పరిణామమని గడ్కరీ అన్నారు.
ఇథనాల్, గ్రీన్ హైడ్రోజన్‌తో నడిచే కార్ల తయారీపై దృష్టి సారించాలని గడ్కరీ కోరారు. ఇప్పటికే మారుతి సుజుకి, హూండా కార్ల కంపెనీలు డీజిల్ కార్ల తయారీని నిలిపేశాయి.