స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో ఎలాంటి అవినీతి లేదని, కేవలం చంద్రబాబుపై కక్షతోనే అక్రమంగా అరెస్ట్ చేశారని టీడీపీ నేత, హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యానించారు. కక్ష సాధింపే లక్ష్యంగా సీఎం జగన్మోహన్రెడ్డి పనిచేస్తున్నాడని ఆయన విమర్శించారు. జగన్ జైలుకు వెళ్లివచ్చాడని అందరినీ జైలుకు పంపాలనుకుంటున్నాడని ధ్వజమెత్తారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వేలాది మంది విద్యార్థులు నైపుణ్యం పెంచుకుని ఉద్యోగాల్లో చేరారని బాలయ్య చెప్పుకొచ్చారు.
స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం ద్వారా తన హిందూపురం నియోజకవర్గంలోనే 1200 మందికి ఉద్యోగాలు వచ్చాయని బాలకృష్ణ గుర్తుచేశారు. అవినీతి జరిగితే ఆధారాలు చూపాలని, ఛార్జిషీట్ ఎందుకు వేయలేదని ఆయన ప్రశ్నించారు. అవినీతి బురద జల్లి చంద్రబాబును అరెస్టు చేసి జైలుకు పంపారని బాలకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ కక్ష సాధించడం తప్ప వైసీపీ ప్రభుత్వం సాధించేదేమీ ఉండదని ఆయన చెప్పారు.
సీఎం జగన్మోహన్ రెడ్డిపై అనేక ఈడీ కేసులు, సీబీఐ కేసులున్నాయని, బెయిల్పై తిరుగుతున్నాడని బాలకృష్ణ గుర్తుచేశారు. 16 నెలలు జైల్లో ఉండి వచ్చాడని, చంద్రబాబును కనీసం 16 రోజులైనా జైల్లో పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ అక్రమ అరెస్టులకు దిగారని ఆయన అభిప్రాయపడ్డారు. స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం ముందుగా గుజరాత్ రాష్ట్రంలో మొదలైందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమం ద్వారా ఏపీలో 2.13 లక్షల మందికి శిక్షణ ఇచ్చినట్టు తెలిపారు. ఇందుకు రూ.370 కోట్లు ఖర్చు చేశారు. ఈ కార్యక్రమం చేసిన డిజైన్ టెక్ సంస్థకు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అభినందన లేఖ ఇచ్చిందని గుర్తుచేశారు. జగన్ సీఎం అయ్యాక ఒక్కరికైనా ఉద్యోగం ఇచ్చారా? చెప్పాలంటూ బాలకృష్ణ ప్రశ్నించారు. ఇలాంటివి ఎన్నో చూశాం. ఎవరికీ భయపడేదే లేదని తేల్చిచెప్పారు.
సంక్షేమానికి, అభివృద్ధికి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అని, జగన్ ఉన్న సంస్థలను విధ్వంసం చేశాడని బాలకృష్ణ విమర్శించారు. ఏపీలో యువతను గంజాయికి బానిసలను చేశాడని, జగన్ చేసే కుట్రలను ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. ఇలాగే వదిలేస్తే పీల్చే గాలిపై కూడా పన్ను వేస్తారని ఎద్దేవా చేశారు. మొరిగితే పట్టించుకోను, అతిక్రమిస్తే మాత్రం ఉపేక్షించేది లేదని తెగేసి చెప్పారు. చంద్రబాబు అరెస్టుకు సానుభూతి తెలిపిన ప్రతిఒక్కరినీ కలుస్తానని, ఎవరూ భయపడాల్సిన పనిలేదు, నేనొస్తున్నానంటూ బాలకృష్ణ పార్టీ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.