కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడోకి జి-20
సదస్సు చేదు అనుభవాన్నే మిగిల్చింది. అసలు సదస్సులో పాల్గొనడమే ఇష్టం లేనట్టు,
భారత పర్యటనలో ముళ్ళ మీద కూర్చున్నట్టు గడిపిన ట్రూడోకి, సదస్సు అయిపోయిన తర్వాత
స్వదేశానికి వెళ్ళడానికి వీలు లేకుండా పోయింది. రెండు రోజులుగా భారత్‌లోనే
ఉండిపోవలసి వచ్చింది. అసలేం జరిగిందంటే…
జస్టిన్ ట్రూడో ప్రభుత్వం, జి-20 సదస్సుకు కొద్ది
రోజుల ముందే, భారత్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం చర్చలను తాత్కాలికంగా
నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. దానికి సరైన కారణాలు కూడా వెల్లడించలేదు. భారత
ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఖలిస్తానీ శక్తులకు కెనడా కేంద్రంగా ఉంది.
రెండు నెలల క్రితం ఖలిస్తానీ శక్తులు కెనడాలోని భారత దౌత్యవేత్తలను బెదిరిస్తూ
పోస్టర్లు వేసాయి. అప్పుడు భారత ప్రభుత్వం తమ ఆందోళనలను కెనడా సర్కారుకు తెలియజేసింది.
ఆ నేపథ్యంలో జి-20 సదస్సుకు హాజరైనప్పటికీ కెనడా
ప్రధాని జస్టిన్ ట్రూడో మొదటినుంచి చివరివరకూ టచ్ మీ నాట్ గానే ఉన్నారు. సదస్సు
తొలిరోజు నిర్వహించిన విందుకు సైతం ఆయన గైర్హాజరయ్యారు. అలాగే, రాజ్‌ఘాట్ వద్ద నివాళులు
అర్పించే సమయంలో కూడా అందరికీ దూరంగానే ఉన్నారు. ప్రధాని నరేంద్రమోదీ చొరవ
తీసుకుని ఆయన చేయి పట్టుకుని మాట్లాడడానికి ప్రయత్నించారు. కానీ ట్రూడో తిరస్కరించడంతో
మోదీ వెనక్కు తగ్గాల్సి వచ్చింది. దానిపై విలేకరులు ప్రశ్నించినప్పుడు కూడా ట్రూడో
స్పందించలేదు.
సదస్సు రెండో రోజు ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా
ట్రూడో సమక్షంలోనే కెనడాలో భారత వ్యతిరేక శక్తులు ఆశ్రయం పొందుతున్న సంగతిని
ప్రస్తావించారు. భారత దౌత్యవేత్తలపై, దౌత్య కార్యాలయాలపై దాడులు, భారతీయుల
ప్రార్థనా స్థలాలపై దాడుల పట్ల ఆందోళన వ్యక్తం చేసారు. అలాంటి పరిస్థితి కెనడాకు
కూడా సమస్యాత్మకమేనని వివరించారు.
జి-20 సదస్సు విజయవంతంగా ముగిసింది. ఆఖరికి రష్యా
ఉక్రెయిన్ వివాదంపైన సైతం అందరికీ ఆమోదయోగ్యంగా ఒక నిర్ణయానికి రాగలిగారు.
అగ్రరాజ్యాలు సహా, సదస్సులో పాల్గొన్న దేశాలన్నీ భారత్ నాయకత్వంపై ప్రశంసలు
కురిపించాయి, కార్యక్రమ నిర్వహణపై సంతృప్తి ప్రకటించాయి. అన్ని దేశాల అధినేతలూ
తమతమ స్థలాలకు చేరుకున్నారు. ఒక్క కెనడా ప్రధాని తప్ప.
జస్టిన్ ట్రూడో ప్రయాణించవలసిన అధికారిక విమానంలో
తీవ్రమైన సాంకేతిక సమస్య తలెత్తింది. దాంతో ఆయన ఆదివారం బయల్దేరలేకపోయారు. సోమవారం
కూడా కదల్లేకపోయారు. న్యూఢిల్లీలోనే ఉండిపోవలసి వచ్చింది. ఇక మంగళవారం కూడా
మధ్యాహ్నం వరకూ ఇక్కడే ఉండిపోయారు. ప్రత్యామ్నాయ విమానం కెనడా నుంచి బయల్దేరింది.
అది భారత్ చేరుకుని ఇక్కణ్ణుంచి కదిలేవరకూ ట్రూడోకు ముళ్ళకంప మీద కూర్చున్నట్టే ఉంటుంది.