ఆఫ్రికా దేశం లిబియాపై డేనియల్ తుఫాను విరుచుకుపడింది. తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు వరదలు ముంచెత్తాయి. డ్యామ్లు తెగిపోవడంతో లిబియాలో 2 వేల మంది చనిపోయారు. మరో 6 వేల మంది గల్లంతయ్యారు. లిబియాలోని ఈశాన్యప్రాంత పట్టణం డెర్నాలో ఈ ఘోరం చోటు చేసుకుంది. డెర్నా పట్టణానికి ఎగువన ఉన్న డ్యామ్లు కొట్టుకుపోవడం వల్ల ఆకస్మిక వరదలు ముంచెత్తాయని లిబియా నేషనల్ ఆర్మీ అధికార ప్రతినిధి అహ్మద్ మిస్మరీ తెలిపారు. ఆకస్మిక వరదలతో వేలాది ఇళ్లు, ప్రజలు సమీపంలోని సముద్రంలోకి కొట్టుకుపోయినట్టు ప్రకటించారు.
లిబియాలో స్థిరమైన ప్రభుత్వం లేకపోవడంతో సరైన సమాచారం ప్రపంచానికి అందడం లేదు. లిబియా తూర్పు, పశ్చిమ భాగాలుగా విడిపోయింది. 2011లో నాటో దళాలు కూడా అక్కడ నుంచి ఉపసంహరించుకోవడంతో అక్కడ అనిశ్చితి నెలకొంది. తాజాగా వచ్చిన వరదలో 2000 మంది చనిపోయారని, 6 వేల మంది గల్లంతయ్యారని స్థానిక మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది.
అర్థరాత్రి డెర్నా పట్టణంపై వరదలు విరుచుకు పడటంతో నిద్రలో ఉన్నవారు లేచే లోపే నీరు చుట్టుముట్టి కొట్టుకుపోయారని రాయిటర్స్ కథనాల ద్వారా తెలుస్తోంది. నిద్ర నుంచి లేచే లోపే తమ చుట్టూ 10 అడుగుల మేర నీరు చేరిందని స్థానికుడు అహ్మద్ మహ్మద్ వాపోయారు. లిబియాను అన్ని విధాలా ఆదుకునేందుకు ఐక్యరాజ్యసమితి ముందుకు వచ్చింది.