పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ త్వరలో తనంత తనే
భారతదేశంలో కలిసిపోతుందని కేంద్రమంత్రి, మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ వీకే సింగ్
అన్నారు. రాజస్థాన్లోని దౌసాలో భారతీయ జనతా పార్టీ పరివర్తన్ సంకల్ప్ యాత్ర
కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేసారు.
పాక్ ఆక్రమిత కశ్మీర్లోని షియా ముస్లిములు తమను
భారత్లోకి వెళ్ళనీయడానికి వీలుగా సరిహద్దులు తెరవాలంటూ ఇటీవల తరచుగా డిమాండ్లు
చేస్తున్నారు. వాటి గురించి మీడియా ప్రతినిధులు వీకే సింగ్ను ప్రశ్నించారు.
దానికి జవాబుగా ‘‘మీరు కొద్దికాలం వేచి చూడండి, పీఓకే దానంతట అదే భారత్లో
కలిసిపోతుంది’’ అని మంత్రి స్పందించారు.
తాజాగా ముగిసిన జి-20 సదస్సు భారత్ అధ్యక్షతన
అద్భుతంగా జరిగిందని, విజయవంతమైందనీ మంత్రి అన్నారు. ఈ సదస్సును నిర్వహించిన తీరు
భారతదేశానికి ప్రపంచ యవనికపై ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టిందన్నారు. జి-20
సదస్సును ఇప్పటివరకూ ఏ దేశమూ ఇంత వైవిధ్యభరితంగా నిర్వహించలేదని, ఆ విషయాన్ని
అగ్రరాజ్యాలు సైతం అంగీకరించాయనీ మంత్రి చెప్పుకొచ్చారు.
ఇక త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే రాజస్థాన్లో
పరిస్థితి గురించి కూడా మంత్రి వ్యాఖ్యలు చేసారు. కాంగ్రెస్ పాలిత రాజస్థాన్లో
శాంతిభద్రతల పరిస్థితి నానాటికీ దిగజారిపోతోందని ఆరోపించారు. రాజస్థానీ ప్రజలు
అధికారంలో మార్పును కోరుకుంటున్నారు. అందుకే వారు బీజేపీ పరివర్తన సంకల్ప యాత్రలో
పెద్దస్థాయిలో పాల్గొంటున్నారు అని మంత్రి వ్యాఖ్యానించారు.
ఇక రాజస్థాన్ ఎన్నికల్లో
బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్ధి ఎవరన్న ప్రశ్నకు సమాధానంగా, బీజేపీ సీఎం అభ్యర్ధిని
ముందే ప్రకటించదనీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చరిష్మా మీదనే ఎన్నికల్లో పోటీ
చేస్తుందని చెప్పారు.