స్కిల్ డెవలప్మెంట్ పథకంలో అక్రమాలు జరిగాయంటూ మాజీ సీఎం చంద్రబాబునాయుడును అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ సీనియర్ న్యాయవాది, మాజీ ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. దీనిపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసు విచారణను అత్యున్నత న్యాయస్థానం రేపటికి వాయిదా వేసింది.
చంద్రబాబు అరెస్ట్ న్యాయ, చట్ట విరుద్దమంటూ సీనియర్ న్యాయవాది శ్రీనివాస్ పిటిషన్లో పేర్కొన్నారు. గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా ప్రతిపక్ష నేతను ఎలా అరెస్ట్ చేస్తారంటూ పిటిషన్లో ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్టు సమయంలో కనీస నిబంధనలు కూడా పాటించకపోవడంపై, పిటిషనర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
స్కిల్ డెవలప్మెంట్ పథకంలో రూ.370 కోట్ల అవినీతి జరిగిందని, నిధులు పక్కదారి పట్టించారంటూ ఏపీ ప్రభుత్వం మాజీ సీఎం చంద్రబాబుపై 2021లో కేసు నమోదు చేసింది. సీఐడీ ఈ కేసులో 152 మందిని విచారించింది. స్కిల్ స్కామ్ చేసులో చంద్రబాబును ఏ39గా చూపారు. ఈ కేసులో చంద్రబాబు ప్రధాన కుట్రదారని సీఐడీ కేసులో పేర్కొంది. దీనిపై విచారించిన ఏసీబీ కోర్టు చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే.