నాలుగు రోజుల కిందట ఆఫ్రికా దేశం మోరాకోలో సంభవించిన భూకంపంలో మృతుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. ఇప్పటికే ఈ భూకంపంలో 2862 మంది చనిపోయారని మరో 2500 మంది తీవ్రంగా గాయపడ్డారని మొరాకో ప్రభుత్వం ప్రకటించింది. శుక్రవారంనాడు మొరాకోలో 6.8 తీవ్రతతో వచ్చిన భూకంపం వేలాది గ్రామాలను నేలమట్టం చేసింది. వేలాది భవనాల కింద చిక్కుకుపోయిన వారిని రక్షించే ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి.
శిథిలాల కింద చిక్కుకుపోయిన వారిని వెలికి తీసేందుకు సైన్యం, పోలీసులు రంగంలోకి దిగారు. వందలాది మంది సేవకులు భవనాల కింద చిక్కుకుపోయిన వారిని గుర్తించి, రక్షించే పనిలో నిమగ్నమయ్యారని అధికారులు తెలిపారు.
భూకంపంతో దెబ్బతిన్న మొరాకోకు అనేక దేశాల నుంచి సాయం అందుతోంది. స్పెయిన్ 30 అగ్ని మాపక దళాలు, డాక్టర్లు, నర్సులు, సాంకేతిక సిబ్బందిని పంపించింది. అయితే మొరాకోలో మారుమూల గ్రామాలను చేరుకోవడం కష్టంగా మారింది. గాయపడిన వారిని గుర్తించి హెలికాఫ్టర్లలో ఆసుపత్రులకు తరలిస్తున్నారు.
తీవ్ర భూకంపం దెబ్బకు లక్షలాది మంది సర్వం కోల్పోయి రోడ్డునపడ్డారు. ఇంత వరకు తమను ఎవరూ ఆదుకోలేదని నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శిథిలాలతో రోడ్లు నిండిపోవడంతో మారుమూల ప్రాంతాల వారికి సాయం అందించడం కష్ట సాధ్యంగా మారిందని సహాయ దళాల అధికారులు తెలిపారు. లక్షలాది మందికి ఆహారం లభించక అలమటిస్తున్నారు. కడుపు నింపుకునేందుకు 15 కి.మీ నడుచుకుంటూ వెళ్లానని భూకంప బాధితుడు అయిట్ మాలిక్ ఆవేదన వ్యక్తం చేశారు.