శివసేన (యుబిటి) నాయకుడు ఉద్ధవ్ థాకరే సంచలనాత్మక
ఆరోపణలు చేసారు. అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం తర్వాత గోద్రా వంటి ఘటన చోటు చేసుకుంటుందని
హెచ్చరించారు.
2024 జనవరిలో అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం
జరగనుంది. ఆ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా నలుమూలల నుంచి వేలాది ప్రజలు
హాజరవుతారని అంచనా. వారందరూ బస్సులు లేదా రైళ్ళలో ప్రయాణించే అవకాశముంది. వారు
వెనుతిరిగి వెళ్ళేటప్పుడు దారిలో ఎక్కడో ఒకచోట గోద్రా తరహా దాడి జరుగుతుందని
ఉద్ధవ్ థాకరే ఆరోపించారు.
‘‘అలా జరగవచ్చు… దాడి జరగవచ్చు… ఏదో ఒక
కాలనీలో వాళ్ళు బస్సులు తగలబెట్టేస్తారు. రాళ్ళు విసురుతారు. నరమేధం జరుగుతుంది.
దేశం మళ్ళీ మంటల్లో మండిపోతుంది. ఆ మంటల్లో వాళ్ళు తమ రాజకీయ వంట వండుకుంటారు’’
అని ఉద్ధవ్ వ్యాఖ్యానించారు. జలగావ్లో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ ఉద్ధవ్ ఈ
వ్యాఖ్యలు చేసారు.
ఉద్ధవ్ వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ నేత రవిశంకర్
ప్రసాద్ స్పందించారు. శివసేన వ్యవస్థాపకులు, ఉద్ధవ్ తండ్రి అయిన బాలాసాహెబ్ థాకరే
రామజన్మభూమి ఉద్యమాన్ని ఆశీర్వదించారని గుర్తు చేసారు. ఆయనకు (ఉద్ధవ్)
బుద్ధినివ్వాలని రాముణ్ణి ప్రార్థిస్తానని చెప్పారు.
అధికార
వాంఛతోనే ఉద్ధవ్ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు.
‘‘ఉద్ధవ్ థాకరే అధికార కాంక్షతో ఏం చేస్తున్నారు? దీనిగురించి బాలాసాహెబ్
ఏమనుకుంటారో నాకు తెలియడం లేదు. సనాతన ధర్మం గురించి అవాకులు, చెవాకులు
మాట్లాడినప్పుడు రాహుల్ గాంధీ కానీ, ఉద్ధవ్ థాకరే కానీ ఒక్క మాట మాట్లాడనే లేదు.’’
అన్నారు.