టీడీపీ
అధినేత చంద్రబాబు నాయుడుపై మరో కేసు నమోదైంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు
కేసులోనూ చంద్రబాబును విచారించడానికి అనుమతి కోరుతూ సీఐ, ప్రిజనర్ ఇన్ ట్రాన్సిట్
( పీటీ) వారెంట్ వేసింది. 2022లో నమోదైన
కేసులో పీటీ వారెంటుపై చంద్రబాబును విచారించేందుకు కోర్టు అనుమతి కోరింది.
ఈ
కేసులో ఏ1గా చంద్రబాబు, ఏ2గా నారాయణ, ఏ6గా లోకేశ్ ఉన్నారని, చంద్రబాబును
విచారించాల్సిన అవసరం ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు.
ఈ
కేసుకు సంబంధించి ఏపీ హైకోర్టులో ఇది వరకే వాదనలు పూర్తయ్యాయి. న్యాయస్థానం తీర్పును
రిజర్వులో ఉంచింది. ప్రస్తుతం స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టై రాజమహేంద్రవరం
సెంట్రల్ జైల్లో ఉన్నారు. దీంతో సీఐడీ పీటీ వారెంట్ కోరుతూ పిటిషన్ వేసింది.
స్కిల్
డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును ఐదు రోజుల కస్టడీకి కోరుతూ మరో పిటిషన్ దాఖలు చేసింది.
చంద్రబాబు
హౌస్ రిమాండ్ పై ఏసీబీ కోర్టులో ఇరువర్గాల వాదనలు ముగిసాయి. సీఐడీ తరఫున ఏజీ
శ్రీరామ్, పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించగా, చంద్రబాబు తరఫున ప్రముఖ న్యాయవాది
సిద్ధార్థ లూద్రా వాదించారు. కాసేపట్లో న్యాయమూర్తి తీర్పు చెప్పనున్నారు. తీర్పూ అనుకూలంగా రాకపోతే హైకోర్టుకు వెళ్ళాలని టీడీపీ లీగల్ సెల్
భావిస్తోంది.
చంద్రబాబు
ఇప్పటి వకు ఎస్ఎస్జీ భద్రతలో ఉన్నారని, ఆయనకు ప్రస్తుతం జైల్లో కల్పించిన భద్రతపై
అనుమానం ఉందని లూద్రా వాదించారు. హౌజ్ కస్టడీకి సంబంధించి గతంలో సుప్రీంకోర్టు
ఇచ్చిన తీర్పును పరిశీలించాలని కోరారు.
చంద్రబాబు
భద్రతకు ఎలాంటి ఇబ్బందులు లేవని, రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబుకు
గట్టిభద్రత కల్పించామని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ తెలిపారు. జైలులో చంద్రబాబుకు
ప్రత్యేక గదితో పాటు సీసీ కెమెరాల పర్యవేక్షణలో కొనసాగుతోంది. జైల్లో కల్పిస్తున్న
భద్రతపై జైళ్ళ శాఖ డీజీ ఆదేశాలను న్యాయమూర్తికి అందజేశారు. చంద్రబాబు సాక్షులను
ప్రభావితం చేసే అవకాశం ఉందని, గృహ నిర్బంధం పిటిషన్ ను డిస్మిస్ చేయాలని కోరారు.