ఢిల్లీ వేదికగా నిర్వహించిన జీ20 సమావేశాలు విజయవంతం కావడంతో స్టాక్ మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. గడచిన కొంత కాలంగా చిన్న, మధ్య తరహా కంపెనీల షేర్లు లాభాల్లో దూసుకెళుతున్నా, స్టాక్ సూచీలు మాత్రం పరిమితికి లోబడి కదలాడాయి. అయితే జీ20 సమావేశాల్లో పలు కీలక వాణిజ్య ఒప్పందాలు చోటు చేసుకోవడం, ఇండియా, సౌదీ అరేబియా , యూరప్ రైల్వే కారిడార్ ఏర్పాటుకు చొరవ తీసుకోవడంలాంటి అంశాలు రైల్వే స్టాక్స్ దూసుకుపోయేలా చేశాయి. దీంతో సెన్సెక్స్ సూచీ 528 పాయింట్ల లాభంతో 67127 వద్ద ముగిసింది. నిఫ్టీ ఇవాళ ట్రేడింగ్లో మొదటి సారి 20 వేల మార్కును దాటింది. మార్కెట్లు ముగిసే సమయానికి కొద్దిగా తగ్గి 176 పాయింట్ల లాభంతో 19996 వద్ద స్థిరపడింది.
ఇర్కాన్, రైట్స్, ఐఆర్ఎఫ్సీ, ఆర్వీఎన్ఎల్ షేర్లు 20 శాతం పైగా దూసుకెళ్లాయి. అదానీ ఎంటర్ప్రైజెస్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, అపోలో హాస్పటల్స్, యాక్సిస్ బ్యాంకు షేర్లు లాభాలను ఆర్జించాయి. వేదాంతా, కోల్ ఇండియా, స్వరాజ్ ఇంజనీరింగ్, పెట్రోనెట్ కంపెనీల షేర్లు నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర బ్యారెల్కు 90 డాలర్లను దాటిపోవడం స్టాక్ మార్కెట్లను కొంత అనిశ్చితికి గురిచేస్తోంది.