ఉదయనిధి స్టాలిన్ మళ్ళీ నోరు పారేసుకున్నారు.
ఈసారి ప్రత్యర్థి పార్టీలను లక్ష్యం చేసుకున్నారు. ఒక పెండ్లి వేడుకలో పాల్గొన్న
ఉదయనిధి ఆ వ్యాఖ్యలు చేసారు. అయితే ఇలాంటి నోటి తీటకు అడ్డుకట్ట వేయడానికి
న్యాయస్థానాలు ఎందుకు ముందుకు రావడం
లేదన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇస్లామిక్ గ్రంథాల్లో ఉన్న విషయాన్ని గుర్తు చేసిన
పాపానికే నూపుర్ శర్మపై విరుచుకుపడిపోయిన సుప్రీంకోర్టు ఇప్పుడు ఎక్కడకు పోయిందన్న
అనుమానాలు తలెత్తుతున్నాయి.
తాజాగా ఉదయనిధి బీజేపీని విషసర్పంతో పోల్చారు.
అన్నాడీఎంకే పార్టీని ఇంటిముందుండే చెత్తతో పోల్చారు. విషసర్పం మీ ఇంట్లోకి వస్తే,
దాన్ని తీసి బైట పడేస్తే సరిపోదు. అది ఇంటి చుట్టుపక్కలే చెత్తలో దాక్కొని
ఉంటుంది. ఆ చెత్తని తీసేసేవరకూ ఆ పాము ఇంట్లోకి వస్తూనే ఉంటుంది. చెత్తని తీసేస్తే
తప్ప పాము బైటకు పోదు. అన్నాడీఎంకే అనే చెత్తని తొలగిస్తే తప్ప బీజేపీ అనే
విషసర్పాన్ని తరిమివేయలేము… అని ఉదయనిధి
వ్యాఖ్యానించారు. అటు అన్నాడీఎంకే, ఇటు బీజేపీ రెండు పార్టీలనూ అంతం చేయాలనే అర్ధం
వచ్చేలా మాట్లాడారు.
కొద్ది రోజుల క్రితం సనాతన ధర్మాన్ని
నిర్మూలించాలి అంటూ ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం
రేకెత్తించాయి. సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియా లాంటి వైరస్ అనీ, దాన్ని సమూలంగా
నిర్మూలించాల్సిందేననీ ఉదయనిధి సూత్రీకరించారు. దానిపై దేశవ్యాప్తంగా దుమారం
రేగేసరికి, నాలుక తిరగేసారు ఉదయనిధి. తాను సనాతన ధర్మం మొత్తాన్నీ
తుడిచిపెట్టెయ్యాలన్న మాట అనలేదనీ, కేవలం కుల వ్యవస్థను మాత్రమే నిర్మూలించాలని
అన్నట్టు మాట మార్చారు. ఐతే, ఉదయనిధి వ్యాఖ్యల మర్మం బైటపెట్టేసారు ఎ రాజా. సనాతన
ధర్మాన్ని అనవసరంగా చిన్నచిన్న వ్యాధులైన మలేరియా, డెంగ్యూలతో పోల్చారనీ, నిజానికి
అది ఎయిడ్స్ వైరస్ లాంటిదనీ అంటూ తమ బుద్ధి బైటపెట్టుకున్నారు. సనాతన ధర్మాన్ని
నిర్మూలించాల్సిందేనని మరోసారి నొక్కి చెప్పారు.
ఉదయనిధి
వ్యాఖ్యలపై హిందూ సంస్థలు భగ్గుమన్నాయి. రకరకాల కేసులు వేసాయి. అయినా వేటికీ
తలొగ్గేదే లేదంటున్నారు డీఎంకే నాయకులు. తన వ్యాఖ్యల మీద కావాలంటే కోర్టులకెళ్ళమని
ఉచిత సలహాలు కూడా ఇచ్చారు ఉదయనిధి. సనాతన ధర్మాన్ని నిందిస్తే కోర్టులు సైతం
పట్టించుకోవు అన్నదే ఆయన ధీమా అయి ఉంటుందని పలువురు భావిస్తున్నారు. దానికి ఇటీవలి
నూపుర్ శర్మ ఉదంతమే నిదర్శనంగా చూపిస్తున్నారు.
వారణాసి జ్ఞానవాపి మసీదులో
శివలింగం బైటపడిన నాళ్ళలో ఒకానొక టీవీ చర్చలో బీజేపీ ప్రతినిథి అయిన నూపుర్ శర్మ
పాల్గొన్నారు. ఆ చర్చలో ముస్లిం ప్రతినిథులు శివుణ్ణి అవమానకరంగా మాట్లాడినప్పుడు,
నూపుర్ శర్మ ముస్లిముల పవిత్ర గ్రంథాలైన హదీసులలోనుంచి కొన్ని వాక్యాలను
ఉటంకించారు. దానితో ఆగ్రహించిన ముస్లిములు నూపుర్ శర్మ మహమ్మద్ ప్రవక్తను అవమానించిందంటూ
రచ్చ చేసారు. ఆ గొడవ పెరిగి పెద్దదవుతున్న తరుణంలో సుప్రీంకోర్టు జోక్యం
చేసుకుంది. నూపుర్ శర్మ క్షమాపణ చెప్పినా పట్టించుకోలేదు. ఆమెను తీవ్రంగా
విమర్శించింది.
‘‘నూపుర్ శర్మ వ్యాఖ్యలు అలజడి కలిగించేలా
ఉన్నాయి. అసలు అలాంటి వ్యాఖ్యలు చేయాల్సిన పని ఆమెకేమిటి? ఆమె మళ్ళీ టీవీ ఛానెల్లో
కూర్చుని దేశానికి క్షమాపణ చెప్పాలి. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నాను అని
చెప్పినా ఇప్పటికే చాలా ఆలస్యమైపోయింది. అది కూడా ఎవరి మనోభావాలైనా దెబ్బతింటేనే
అని షరతులు పెట్టడమేంటి? వీళ్ళు అసలు మతాన్ని అనుసరించేవారు కాదు, రెచ్చగొట్టడం
కోసమే ప్రకటనలు చేస్తారు. ఆమె పిటిషన్ ఆమె దురహంకారాన్ని చూపుతోంది. ఈ దేశపు
న్యాయమూర్తులు తనకంటె చిన్నవాళ్ళు అనుకుంటోంది. ఒక పార్టీ అధికార ప్రతినిథి అయినంత
మాత్రాన నోటికొచ్చినట్టు మాట్లాడకూడదు. దేశంలో జరుగుతున్న గొడవలన్నింటికీ ఈ మహిళే బాధ్యురాలు.’’
అంటూ…. నూపుర్ శర్మపై దేశ అత్యున్నత న్యాయస్థానం విరుచుకుపడింది. ఆఖరుకు, నూపుర్
మీద దేశంలో పలుచోట్ల నమోదైన ఎఫ్ఐఆర్లను కలిపి విచారించాల్సిందన్న అభ్యర్ధనను కూడా
అంగీకరించలేదు.
మరి ఉదయనిధి విషయంలో ఏం జరిగింది? ఆయన మాట్లాడి
ఇన్ని రోజులవుతున్నా, ఇప్పటివరకూ ఏ న్యాయస్థానానికీ వినిపించనే లేదు. ‘సనాతన ధర్మం
ఒక చీడ, దాన్ని నిర్మూలించాలి’ అన్న వ్యాఖ్యలు సమాజంలో కలిగించిన అలజడీ ఏమీ
లేనట్టే న్యాయస్థానాలు మౌనంగా ఉండిపోయాయి. ఉదయనిధి చేసిన వ్యాఖ్యలు, సనాతన
ధర్మాన్ని అనుసరించేవాళ్ళను రెచ్చగొట్టడానికి చేసే ప్రకటనలుగా ఏ న్యాయస్థానానికీ
కనిపించలేదు. అతని వ్యాఖ్యల్లో దురహంకారం ఏమీ కనిపించలేదు. అవే ఆరోపణలను పదేపదే
చేస్తూ సనాతన ధర్మాన్ని పదేపదే అవమానించడం కోర్టుకు కనిపించడం లేదు. ఒక పార్టీ
నాయకుడైనంత మాత్రాన నోటికొచ్చినట్టు మాట్లాడకూడదు అనే ధైర్యం ఏ కోర్టూ చేయడం లేదు.
దేశంలో కలిగిన అలజడులకు, గొడవలకు ఉదయనిధే బాధ్యుడిగా న్యాయస్థానానికి కనిపించడం
లేదు.
అందరినీ సమభావనతో
చూడవలసిన న్యాయస్థానాలే… ఇలా వివక్షా పూరితంగా వ్యవహరిస్తున్నాయన్న భావం కలుగుతోంది. నూపుర్ శర్మ
విషయంలో ఒకలా, ఉదయనిధి విషయంలో మరొకలా ప్రవర్తిస్తున్నాయని పలువురు వాపోతున్నారు. ఈ దేశంలో న్యాయస్థానాలు
హిందువులకు మాత్రం కాదు, కేవలం హైందవేతరులకు మేలు చేయడానికి మాత్రమేనా అన్న అనుమానాలు
రేకెత్తిస్తుండడం విషాదకరం.